తెలంగాణ

telangana

ETV Bharat / international

టోర్నడో మిగిల్చిన విషాదం

అమెరికా అలబామాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. 23మందిని బలిగొని... ఎన్నో కుటుంబాలలో తీరని శోకాన్ని నింపింది. భర్తను కోల్పోయిన ఓ మహిళ కంటతడి.. అందరి హృదయాల్ని కలచివేసింది.

టోర్నడో మిగిల్చిన విషాదం

By

Published : Mar 5, 2019, 1:15 PM IST

Updated : Mar 5, 2019, 1:24 PM IST

టోర్నడో ధాటికి శోకసంద్రంలో మునిగిన అమెరికా వాసులు

కలల సౌధాలు శిథిలమయ్యాయి. జీవితాలు తారుమారయ్యాయి. అయినవారి మృతితో అనేక కుటుంబాలకు కన్నీళ్లే మిగిలాయి. టోర్నడో బీభత్సం తర్వాత అమెరికాలోని అలబామాలో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివి.

గత ఆరేళ్లలో అత్యంత భయానక విపత్తు అలబామాను కుదిపేసింది. తీవ్ర తుపాను కారణంగా భారీ ఆస్తినష్టం వాటిల్లింది. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల కొద్దీ చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ లేక అంధకారం అలముకుంది.

ఆత్మీయుల్ని కోల్పోయిన వారి రోదనలు మిన్నంటాయి. భర్తను కోల్పోయిన ఓ మహిళ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ ఘటనను గుర్తుచేస్తే చాలు 53 ఏళ్ల కరోల్​ డీన్​ విలపిస్తుంది. టోర్నడో ధాటికి ఇల్లు కూలి... భర్త డేవిడ్​ను కోల్పోయింది డీన్​.

2015లో సామాజిక మాధ్యమాల వేదికగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటినుంచి విడదీయరాని బంధంగా ఉన్న వీరి మధ్యకు టోర్నడో రూపంలో అనుకోని ప్రళయం దూసుకొచ్చింది. వీరి భవిష్యత్తు కలల్ని, ఆశయాల్ని చిద్రం చేసింది.

''ఇది నా జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు. నేను విధి నిర్వహణలో ఉన్నాను. అతడు ఇంటివద్ద ఉన్నాడు. నేను ఒకవేళ ఇంటికి త్వరగా వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అదే స్థితిలో నేనుంటే అతడు నన్ను రక్షించేవాడు. మేం ఇక్కడుండే వాళ్లమే కాదు.''

- కరోల్​ డీన్​, బాధితురాలు

టోర్నడో బీభత్సం తర్వాత అనేక మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. శిథిలాల కింద బాధితులు ఇప్పటికీ బతికే ఉంటారని ఎక్కడో చిన్న ఆశ. అందుకే యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపడుతున్నారు అధికారులు.

Last Updated : Mar 5, 2019, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details