తాలిబన్లతో మళ్లీ సమావేశమవనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వారానికే పురోగతి కనిపించింది. అఫ్గానిస్థాన్‌లో అమెరికా ప్రతినిధి జల్మాయ్ ఖలీల్జాద్... చర్చలను పునరుద్ధరించడానికి ఇప్పటికే కాబూల్ వెళ్లినట్లు అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
''తాలిబన్లు ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే కాబూల్‌లో ఉన్న జల్మాయ్ ఖలీల్జాద్.. తాలిబన్లతో చర్చించేందుకు ఖతార్ వెళ్లనున్నారు. శాంతి చర్చలు సానుకూలంగా సాగాలనుకుంటున్నాం. ముఖ్యంగా కాల్పుల విరమణకు దారి తీసే హింసను తగ్గించాలని చెబుతున్నాం.''
- అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన
ట్రంప్ ఆకస్మికంగా...
18 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అమెరికా దళాలను అఫ్గానిస్థాన్ నుంచి రప్పించే దిశగా అగ్రరాజ్యానికి-తాలిబన్లకు మధ్య కొద్ది నెలల కింద చర్చలు జరిగాయి. ఆ సమయంలో తాలిబన్లతో రహస్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. దాదాపు 3 నెలల తర్వాత.. ఇటీవల ఆకస్మికంగా అఫ్గానిస్థాన్‌లో పర్యటించిన ట్రంప్.. తాలిబన్లతో శాంతి చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించారు.
'థ్యాంక్స్ గివింగ్’ రోజును పురస్కరించుకొని అఫ్గాన్ వెళ్లారు ట్రంప్. అక్కడి.. బగ్రామ్ వైమానిక క్షేత్రంలో అమెరికా సైనికులను కలుసుకున్నారు.
ఇదీ చూడండి:అఫ్గాన్‌లో ట్రంప్ 'మెరుపు పర్యటన'- సైనికులతో కలిసి విందు