ఈ వారం చివరినాటికి 160 మిలియన్ల మంది అమెరికన్లకు వ్యాక్సినేషన్(రెండు డోసులు) పూర్తవుతుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ప్రకటించారు. మహమ్మారి నుంచి స్వేచ్ఛను పొందేరోజు ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జనవరి నుంచి కొవిడ్ కేసులు(Covid cases), మరణాలు 90 శాతం తగ్గాయని పేర్కొన్న ఆయన.. పూర్తిగా టీకా(రెండు డోసులు) అందుకున్న దేశ పౌరులు.. కరోనా ముందునాటి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు.
"కొవిడ్ పోరులో తుది ఘట్టానికి చేరుకున్నాం. ఈ విషయాన్ని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. 150 రోజుల్లోనే 300 మిలియన్ల డోసులను పంపిణీ చేశాం. 182 మిలియన్ల మందికిపైగా ఒక డోసును అందుకున్నారు. అందులో 90 శాతం వృద్ధులు సహా 27ఏళ్లు దాటిన 70 శాతం మందికి టీకా వేశాం. ఈ వారం చివరి నాటికి పూర్తిగా టీకా అందుకున్నవారి సంఖ్య 160 మిలియన్ల మార్కును దాటనుంది. జులై నాలుగో తేదీకి నిర్దేశించిన లక్ష్యాన్ని ఆ తర్వాత మరి కొన్నిరోజుల్లోనే చేరుకోనున్నాం."
- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి ఆర్థిక వృద్ధి
దేశంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని.. వాణిజ్య సంస్థలు తిరిగి తెరుచుకుంటాయన్నారు. ఆర్థిక వృద్ధి నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. కరోనాపై విజయానికి అమెరికా చేరువయ్యిందన్న బైడెన్.. కొవిడ్‌ను పూర్తిగా అధిగమించలేదన్నారు.