క్షిపణుల నియంత్రణకు సంబంధించి అమెరికా, రష్యాల మధ్య చేసుకున్న ఒప్పందం రద్దయిన తర్వాత రెండోసారి అగ్రరాజ్యం క్షిపణి పరీక్షను నిర్వహించింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణితో పరీక్ష నిర్వహించినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ పేర్కొంది.
రష్యాతో ఒప్పందం రద్దు తర్వాత అమెరికా కీలక పరీక్షలు - రష్యా అమెరికా ఒప్పందం
అగ్రరాజ్యం అమెరికా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. క్షిపణి 500 కి.మీ పైగా దూరం ప్రయాణించినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ వెల్లడించింది. రష్యాతో క్షిపణి నియంత్రణ ఒప్పందం రద్దయిన తర్వాత రెండోసారి ఈ పరీక్షలు నిర్వహించడం గమనార్హం.
కాలిఫోర్నియాలోని వాండెన్‌బెర్గ్ ఎయిర్స్‌ఫోర్స్ బేస్ నుంచి జరిపిన ఈ క్షిపణి పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలను అమెరికా వెల్లడించలేదు. క్షిపణి 500 కిలో మీటర్లకుపైగా ప్రయాణించినట్లు మాత్రమే పెంటగాన్ తెలిపింది. రష్యాతో 1987లో కుదిరిన ఒప్పందం నుంచి అగ్రరాజ్యం ఆగస్టులో వైదొలిగింది. ఆ తర్వాత ఇది అమెరికా చేపట్టిన రెండో క్షిపణి ప్రయోగం.
అయితే వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోన్న ఉత్తర కొరియాకు అమెరికా తాజా ప్రయోగం ఓ హెచ్చరిక లాంటిది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఇప్పటికే పలుమార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించింది ఉత్తర కొరియా. ఈ ఏడాది చివరినాటికి అమెరికా తమకు రాయితీలు ప్రకటించకపోతే క్రిస్మస్ రోజు మరో ప్రయోగం నిర్వహించనున్నట్లు ఉత్తర కొరియా ఇది వరకే ప్రకటించింది.