భారత్‌కు వెళ్లేవారు నేరాలు, ఉగ్రవాదం, కరోనా వంటి అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికా తన పౌరులకు సూచించింది. అలాగే.. పాకిస్థాన్‌కు వెళ్లాలనుకునే పౌరులు తమ ప్రయాణంపై పునరాలోచించవాల్సిందిగా కోరింది. ఉగ్రవాదం, మతపరమైన హింస వంటివాటి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.
తీవ్రవాదం, పౌర అసమ్మతి ఎక్కువగా ఉన్న కారణంగా జమ్ముకశ్మీర్‌కు వెళ్లొద్దని.. అలాగే యుద్ధవాతావరణానికి అవకాశం ఉన్నందున భారత్-పాక్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధి లోపు ప్రయాణించవద్దని అమెరికా విదేశాంగ శాఖ భారత్‌కు వెళ్లే తమ పౌరులకు సలహా ఇచ్చింది.
"భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నేరాల్లో అత్యాచారం ఒకటని నివేదికలు చెబుతున్నాయి. పర్యటక, ఇతర ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, హింసాత్మక ఘటనలు జరిగిన ఉదంతాలున్నాయి"
---అమెరికా విదేశాంగ శాఖ
మరోవైపు.. తమ పౌరులకు కొవిడ్ నిబంధనలను సైతం సూచించింది అమెరికా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం(సీడీసీ). టీకా పూర్తి డోసులు తీసుకున్నవారికి.. వైరస్ సంక్రమించే ప్రమాదం, తీవ్రమైన లక్షణాలు అభివృద్ధి చెందే అవకాశం తక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఈ మేరకు 'లెవల్ వన్' కొవిడ్-19 నిబంధనలు జారీ చేసింది.