కొవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శించారు. కరోనా వైరస్‌పై సమాచారాన్ని చైనా దాచిపెట్టడంవల్లే ఇప్పుడు ప్రపంచమంతా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందన్నారు. శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరోసారి చైనా తీరును తప్పుబట్టారు. చైనాలోని వుహాన్ నగరంలో బయటపడినట్లు భావిస్తున్న కరోనా వైరస్‌ను ఆదిలోనే కట్టడిచేస్తే అది ఆ ప్రాంతానికే పరిమితమయ్యేదనే అభిప్రాయపడ్డారు. ఈ విషయం ప్రపంచానికంతటికీ తెలుసునని, ఇదే నిజమని తానుకూడా బలంగా నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు ట్రంప్.
చైనా విఫలమైనందునే..
ఈ వైరస్‌పై కొన్ని నెలలముందే సమాచారం తెలిసి ఉంటే ప్రపంచం మొత్తానికి ఇది విస్తరించేది కాదన్నారు. ఆ సమయంలో వైరస్ గురించి వారి దగ్గరున్న సమాచారాన్ని ప్రపంచ దేశాలకు తెలపడంలో చైనా విఫలమైందని దుయ్యబట్టారు. కరోనా వైరస్ తీవ్రతను ప్రపంచానికి తెలియజేయకుండా అడ్డుపడుతూ చైనా.. అక్కడి వైద్యులు, జర్నలిస్టులపై చర్యలు తీసుకుందన్నారు. ఇలా ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కారణమైన బీజింగ్ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి కారణమైన చైనాపై ప్రతిచర్యలు ఉంటాయా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు.