ప్రపంచంలోనే అత్యంత క్రూర నిర్బంధ కేంద్రం గ్వాంటానమో బే జైలును అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. శిథిలావస్థకు చేరిన ఈ కారాగారంలోని ఖైదీలను మరో చోటకు తరలించినట్లు అమెరికా సదరన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. క్యూబా సమీపంలోని అమెరికా నౌకా స్థావరంలో ఏర్పాటుచేసిన ఈ జైలులో వివిధ దేశాల నుంచి రహస్యంగా పట్టుకొచ్చిన వ్యక్తులను సీఐఏ, అమెరికా సైనిక దళాలు బంధించేవి. క్యూబాకు ఆగ్నేయంగా సముద్ర తీరంలో గ్వాంటానమా బే నౌకా స్థావరం ఉంది. ఇక్కడ ఇప్పటిదాకా బంధించిన క్యాంప్ 7లోని ఖైదీలను క్యాంప్ 5కు మార్చినట్లు మయామీ కేంద్రంగా పనిచేసే సదరన్ కమాండ్ వెల్లడించింది. అయితే, ఎంత మందిని తరలించారనే వివరాలు తెలపలేదు. క్యాంప్ 7లోకి పాత్రికేయులు సహా ఇతరులెవరికీ అనుమతి లభించేది కాదు. అసలు అది ఎక్కడ ఉండేదో కూడా వెల్లడించేందుకు అమెరికా సైన్యం నిరాకరించేది.
2001లో ఉగ్రదాడులకు పాల్పడినట్లు ఆరోపణలున్న అయిదుగురు వ్యక్తులను కూడా యుద్ధ నేరారోపణలతో క్యాంప్ 7లో బంధించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్వాంటానమో బే జైలును పూర్తిస్థాయిలో మూసివేయాలని భావిస్తున్నట్లు ఇటీవల తెలిపారు. ఇందుకు అమెరికా చట్టసభల ఆమోదం అవసరం.