అమెరికాలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. వందేళ్లలో ఎన్నడూ చూడనంత భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 16 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం అర్హులైన ఓటర్లలో వీరు 67 శాతం కాగా.. 1900 సంవత్సరం తర్వాత ఇదే అత్యధిక ఓటింగ్ శాతంగా రికార్డుకెక్కే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగానే సాగింది. చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ట్రంప్, బైడెన్లు ప్రయత్నించారు. ఓటింగ్‌కు తరలిరావాలని కోరారు.
ఇదో చరిత్ర!
అమెరికాలో ప్రస్తుత ఓటింగ్ చరిత్రలో నిలిచిపోనుందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 16 కోట్ల మంది ఓటేస్తారని ఫ్లోరిడా యూనివర్సిటీ అనుబంధ ఆచార్యులు మైఖేల్ పీ మెక్‌డొనాల్డ్ వెలువరించిన అంచనాలను ప్రస్తావించింది. టెక్సాస్, కొలరాడో, వాషింగ్టన్, ఓరెగన్, హవాయి, మోంటనా రాష్ట్రాల్లో పోలైన ముందస్తు ఓట్లు 2016లో నమోదైన మొత్తం ఓట్లకన్నా అధికంగా ఉందని పేర్కొంది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో దాదాపు గత ఎన్నికల మొత్తం ఓట్ల స్థాయిలో ముందస్తు పోలింగ్ నమోదైనట్లు తెలిపింది.
"మల్లగుల్లాలు పడుతున్న ఆర్థిక వ్యవస్థ తీరు, కరోనా వ్యాప్తి, ట్రంప్ హయాంలో రాజకీయ వ్యవహారాలు సహా దేశంలోని ప్రతి ఒక్కరిపై ప్రభావం పడే పరిణామాలు ఉన్న నేపథ్యంలో భారీగా ఓటర్ టర్నవుట్ నమోదైనట్లు కనిపిస్తోంది. మహమ్మారి సమయంలోనూ ఓటింగ్ సురక్షితంగా, సులభంగా నిర్వహించేలా పలు రాష్ట్రాలు తీసుకున్న చర్యలు కూడా ఇందుకు దోహదం చేశాయి."
-న్యూయార్క్ టైమ్స్
ఎన్నికల రోజున రిపబ్లికన్ ఓటర్లే అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ముందస్తు ఓటింగ్, మెయిల్ ఇన్ ఓట్లను డెమొక్రాట్లు అధికంగా వినియోగించుకున్నారని తెలిపింది. ఎన్నికల రోజు డెమొక్రాటిక్ ఓటర్లు సైతం భారీగానే హాజరైనట్లు వెల్లడించింది.