తెలంగాణ

telangana

ETV Bharat / international

న్యూయార్క్​లో మరోసారి తగ్గిన కరోనా మరణాలు - అగ్రరాజ్యం

అగ్రరాజ్యాన్ని కరోనా వీడటం లేదు. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య అమాంతం పెరుగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో అక్కడ మరో 1738 మంది మరణించినట్లు జాన్స్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం వెల్లడించింది. కేసులు 8 లక్షల 50 వేలకు దగ్గర్లో ఉన్నాయి. అయితే.. న్యూయార్క్​లో మరోసారి మృతుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగిస్తోంది.

US sees 1,738 new coronavirus deaths in 24 hours
న్యూయార్క్​లో మరోసారి తగ్గిన కరోనా మరణాలు

By

Published : Apr 23, 2020, 8:18 AM IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. ఇప్పటివరకు 8 లక్షల 48 వేలమందికిపైగా వైరస్‌ సోకగా.. 47 వేల 650కిపైగా చనిపోయారు. దాదాపు 86 వేల మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 1738 మంది కరోనా కారణంగా చనిపోయారని జాన్స్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం వెల్లడించింది. క్రితం రోజుతో పోలిస్తే ఇది కాస్త తక్కువే. బుధవారం మరో 30 వేల మంది వైరస్​ బారినపడ్డారు.

న్యూయార్క్​లో...

దేశం మొత్తం మృతుల్లో న్యూయార్క్​లోనే 15 వేల కంటే ఎక్కువగా ఉన్నారు. ఇది రాష్ట్రంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక్కడ క్రమంగా వైరస్​ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు గవర్నర్​ ఆండ్రూ క్యూమో. బుధవారం అక్కడ మరో 474 మంది చనిపోయినట్లు ఆయన తెలిపారు. గత 3 వారాల్లో ఇదే అత్యల్పం.

ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య కొద్ది రోజులుగా తగ్గుతోందని అన్నారు. అయితే... ఇలా ఎన్ని రోజుల పాటూ సాగుతుందో చెప్పడం కష్టమని తెలిపారు ఆండ్రూ. ట్రంప్​తో మంగళవారం జరిగిన భేటీ ఫలవంతంగా సాగిందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో చర్చించినట్లు వెల్లడించారు క్యూమో. న్యూయార్క్​లో రోజువారీ టెస్టులను 40 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

ముందుంది ముప్పు..!

అమెరికాలో మున్ముందు కరోనా ఎక్కువగా కల్లోలం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న శీతాకాలంలో తమ దేశంలో వైరస్ ప్రభావం పెరిగే ముప్పు ఉందని.. అమెరికాలో వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ పేర్కొన్నారు. శీతాకాలంలో కరోనాకు ఫ్లూ కూడా తోడై పరిస్థితులు భయానకంగా మారొచ్చని తెలిపారు.

మరోవైపు అమెరికాలో నిషేధాజ్ఞల సడలింపు అంశం పూర్తిగా రాజకీయ రంగును పులుముకుంటోంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకు రిపబ్లికన్‌ గవర్నర్లు ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నారని, డెమోక్రాట్‌ గవర్నర్లు ఆజ్ఞలను మరింత కఠినతరం చేస్తున్నారని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details