అఫ్గానిస్థాన్‌లో మిగిలున్న అమెరికా ప్రజలను స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అగ్రరాజ్యం తెలిపింది. తరలింపు ప్రక్రియను మిలిటరీ మిషన్లా కాకుండా.. దౌత్యపరమైన చర్చలతో ముందుకు తీసుకెళ్తామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ స్పష్టం చేశారు.
అఫ్గాన్ ప్రజలకు ఆహారం, వైద్య సదుపాయాలు.. ఇతర సేవలను కొనసాగిస్తామన్నారు. తాలిబన్ల చర్యలను బట్టి ఆర్థిక, అభివృద్ధి పరమైన సహకారాలు కూడా అందిస్తామన్నారు.
దాడులకు సిద్ధం..
ఐసిస్-కే ఉగ్రవాద సంస్థపై వైమానిక దాడులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం దాడులు తామే చేసినట్లు ఇదివరకే ఐఎస్ఐస్-కే ప్రకటించింది. ఐఎస్ స్థావరాలను కూల్చేందుకు కూటమి దేశాలకు సహకరిస్తామని బ్రిటన్ వైమానిక దళాధిపతి సర్ మైక్ విగ్స్టోన్ తెలిపారు.
ప్రపంచ గుర్తింపు కోసం..
అఫ్గాన్‌లో సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లకు చైనా సూచనలు చేసింది. అలా అయితేనే.. ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద సంస్థలను ఎదుర్కొనేందుకు దేశాలు.. ప్రపంచ చట్టాలను, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను అనుసరించాలని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు. అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని చైనా గౌరవిస్తుందన్నారు. ఆ దేశంలోని వ్యవహారాలపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:Donald Trump: 'అఫ్గాన్‌పై బాంబులేద్దాం.. మన సామాను తెచ్చేసుకుందాం'