తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత వైద్య సహకారం కోసం అమెరికా ఒప్పందం!'

భారత్​తో వైద్య రంగంలో భాగస్వామ్యం మెరుగుపర్చేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సహకారం కరోనాపై పోరాడేందుకు ఉపయోగపడిందని పేర్కొంది. విద్యుత్ రంగం సహా, పర్యావరణ మార్పులపైనా భారత్​తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది.

US says it looks forward to 'overarching' MoU to enhance health cooperation with India
'భారత వైద్య సహకారం కోసం అమెరికా ఒప్పందం!'

By

Published : Feb 23, 2021, 11:32 AM IST

కరోనా మరణాలు ఐదు లక్షలు దాటిన వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. వైద్య రంగంలో భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపర్చేలా భారత్​తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. వైద్య, బయోమెడికల్ పరిశోధనా రంగాల్లో దశాబ్దాలుగా మధ్య ఉన్న సహకారమే.. కరోనాపై పోరులో ఇరు దేశాలు సమన్వయంతో ముందుకెళ్లేందుకు తోడ్పడిందని పేర్కొంది.

"ఇరుదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేలా అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు మేం ఎదురుచూస్తున్నాం. కరోనాను నివారించేందుకు వ్యాక్సిన్ సహా ఇతర చికిత్స విధానాల రూపకల్పనపై కలిసి పనిచేస్తున్నాం. కీలకమైన ఔషధాలను తయారు చేసి, ప్రపంచానికి అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించాం."

-నెడ్ ప్రైస్, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి

భారత ఫార్మా రంగం అత్యంత బలంగా ఉందని నెడ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం కోసం టీకాల తయారీలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. కరోనాపై అమెరికా ఫార్మా రంగం భారత్​లోని సంస్థలతో కలిసి పనిచేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

అమెరికా, భారత్ మధ్య విద్యుత్ రంగంలో ఉన్న భాగస్వామ్యం 21వ శతాబ్దపు అవసరాలకు పెద్దపీట వేస్తోందని నెడ్ తెలిపారు. సుస్థిరాభివృద్ధి, జాతీయ భద్రత, ప్రాంతీయ అంతర్జాతీయ సుస్థిరతలకు అనుగుణంగా తమ భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. సహజవాయువు, అణు శక్తి, స్మార్ట్ గ్రిడ్, సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల విషయంలో ఈ భాగస్వామ్యం భవిష్యత్తులోనూ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.

వాతావరణ మార్పులపైనా భారత్​తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు నెడ్. పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:మార్స్​పై రోవర్‌ దిగిన అద్భుత దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details