ఇరాన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. అణు కార్యక్రమం విషయంలో నెలకొన్ని విభేదాలను పరిష్కరించుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా 2015 నాటి అణు ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని తెలిపింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2015లో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం నుంచి 2018లో ట్రంప్ హయాంలో అమెరికా వైదొలిగిన విషయం తెలిసిందే.
హామీ ఇస్తేనే..
ఒప్పందంలోని నిబంధనలకు కట్టుబడేందుకు ఇరాన్ అంగీకరిస్తే తిరిగి డీల్‌లో చేరతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన బృందం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించింది. దీంతో ఈ విషయంపై చర్చించేందుకు ఒప్పందంలోని భాగస్వామ్య దేశాలు ఇటీవల పంపిన ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెగ్ ప్రైస్ ప్రకటించారు. ఇరాన్ నిబంధనలకు కట్టుబడి ఉంటామని హామీ ఇస్తే.. మరింత మెరుగైన, బలమైన, సుదీర్ఘ కాలం కొనసాగే ఒప్పందంపై చర్చిస్తామని తెలిపారు. ఇటీవల సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ ఇటీవల ఒప్పందంలోని ఇతర దేశాల ప్రతినిధులతో వర్చువల్‌గా మాట్లాడారు. దాని తర్వాతే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అమెరికా ప్రకటనపై ఐరోపా భాగస్వామ్య దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.