తెలంగాణ

telangana

ETV Bharat / international

కట్టలు తెంచుకుంటున్న కరోనా- ఆ దేశాలు విలవిల - japan covid surge olympics

కరోనా మళ్లీ భీకరరూపు దాల్చింది. అమెరికా, జపాన్ సహా పలు దేశాల్లో ప్రమాదకరంగా విజృంభిస్తోంది. అగ్రరాజ్యంలో ఒక్కరోజే 88 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒలింపిక్స్​ జరుగుతున్న టోక్యో నగరం వైరస్​ వ్యాప్తితో వణికిపోతోంది.

JAPAN US covid cases
కట్టలు తెంచుకుంటున్న కరోనా

By

Published : Jul 29, 2021, 1:02 PM IST

కరోనా వైరస్ మరోసారి కట్టలు తెంచుకుంటోంది. అగ్రరాజ్యం అమెరికాపై మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. వేగవంతమైన వ్యాక్సినేషన్‌ కారణంగా ఆ మధ్య వైరస్‌ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించగా.. గత కొన్ని రోజులుగా మహమ్మారి మళ్లీ పడగవిప్పుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. తాజాగా అక్కడ 24 గంటల వ్యవధిలో 88,376 కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 55శాతానికి మించి కనీసం ఒకడోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయితే వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. గతవారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే.. అత్యధికంగా అమెరికాలోనే నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కూడా తెలిపింది. జులై 25తో ముగిసిన వారంలో అగ్రరాజ్యంలో 5లక్షలకు పైగా కేసులు వెలుగుచూశాయి. అంతక్రితం వారంతో పోలిస్తే ఇది 131శాతం ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ వారానికి సగటు కొత్త కేసుల సంఖ్య 60వేలకు పైనే ఉంటోంది. జూన్‌ నెలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ.

డెల్టా దెబ్బ

వ్యాక్సినేషన్‌ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియంట్‌ విస్తృతే తాజా ఉద్ధృతికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కేసులు మళ్లీ పెరుగుతుండటం వల్ల అమెరికాలోని పలు రాష్ట్రాలు మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి. అంతకుముందు కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టగా మాస్కు అవసరం లేదని ప్రకటించిన రాష్ట్రాలు, తాజాగా మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశిస్తున్నాయి. ప్రజలు సమూహాలుగా ఏర్పడడాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి.

కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రభావితమైన దేశం అమెరికానే. గతేడాది అగ్రరాజ్యాన్ని చిగురుటాకులా వణికించిన మహమ్మారి.. అక్కడ ఇప్పటివరకు 6.12లక్షల మందిని బలితీసుకుంది. దాదాపు 3.5కోట్ల మంది వైరస్‌ బారిన పడ్డారు.

జపాన్ కుదేలు

ఒలింపిక్స్ జరుగుతున్న జపాన్​లో వైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. రోజువారీ అత్యధిక కేసుల రికార్డు మరోసారి బద్దలైంది. టోక్యో నగరమే కాక, దేశవ్యాప్తంగా వైరస్ విజృంభణ కొనసాగుతోందని.. జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రెటరీ కాత్సునోబు కాటో పేర్కొన్నారు.

జపాన్​లో మిగతా దేశాలతో పోలిస్తే కరోనా ప్రభావం స్వల్పంగానే ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. కేసుల ఏడు రోజుల సగటు.. లక్ష మందికి 28కి ఎగబాకింది. అమెరికాలో ఈ సగటు 18.5గా ఉంటే.. భారత్​లో 2.8గా ఉంది.

"ఇన్​ఫెక్షన్​ వ్యాప్తిని తగ్గించేందుకు ఏ చర్యలూ ఫలించడం లేదు. చాలా అంశాలు కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. సంక్షోభం గురించి అవగాహన లేకపోవడమే పెద్ద ప్రమాదంగా పరిణమించింది. ఇలాగే కొనసాగితే కేసులు మరింతగా పెరిగి.. వైద్య వ్యవస్థను ఒత్తిడికి గురి చేస్తాయి."

-డాక్టర్ షిగెరు ఓమి, ప్రభుత్వ వైద్య సలహాదారు

టోక్యోలో కరోనా కేసుల పెరుగుదలను చూసి.. చుట్టుపక్కల రాష్ట్రాల గవర్నర్లు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రాంతాల్లోనూ అత్యవసర పరిస్థితి విధించాలని ప్రధానమంత్రి యొషిహిదె సుగాను అభ్యర్థిస్తున్నారు.

'విశ్వక్రీడలకు వైరస్​తో సంబంధం లేదు'

ఒలింపిక్స్ క్రీడల కారణంగా జపాన్​లో కరోనా కేసులు పెరగలేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది. క్రీడలతో సంబంధం ఉన్నవారి వల్ల జపాన్​లోని ఇతర పౌరులకు వైరస్ సోకలేదని తెలిపింది. ఒలింపిక్స్ నిర్వహణలో భాగంగా ఇప్పటివరకు మూడు లక్షల 10 వేల టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించింది. చాలా తక్కువ సంఖ్యలో పాజిటివ్ వచ్చినట్లు వివరించింది. ఒలింపిక్స్ వల్ల జపాన్ వైద్య వ్యవస్థపై ఎటువంటి భారం పడలేదని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్​- శనివారం నుంచి...

ABOUT THE AUTHOR

...view details