జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోసు వాడకాన్ని నిలిపివేయాలని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థలు నిర్ణయించాయి. రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న నివేదికలపై దర్యాప్తు చేసేందుకు తాజా ప్రతిపాదన చేశాయి. ఈ మేరకు అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ), ఆహార ఔషధ సంస్థ(ఎఫ్డీఏ) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.
వ్యాక్సిన్ వల్ల తలెత్తుతున్న సమస్యలపై చర్చించేందుకు సీడీసీ అడ్వైజరీ కమిటీ బుధవారం భేటీ కానుంది. దీనిపై ఎఫ్డీఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది.
ఇప్పటివరకు 68 లక్షల డోసుల జాన్సన్ టీకాలను అమెరికాలో అందించారు. అందులో ఆరుగురు మహిళలకు రక్తం గడ్డకట్టినట్లు తేలింది. తాజా ఆదేశాలతో అమెరికా ఫెడరల్ కేంద్రాల్లో వెంటనే ఈ టీకా పంపిణీ నిలిచిపోనుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టీకా పంపిణీని నిలిపివేస్తాయి. అయితే.. మోడెర్నా, ఫైజర్ డోసుల పంపిణీ మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.