అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ల మధ్య సంవాదం మరింత హుందాగా జరపాలని డిబేట్‌ను పర్యవేక్షించే కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు నియమ నిబంధనలను మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇరువురి మధ్య జరిగిన తొలి ముఖాముఖి చర్చలో ఇద్దరు నేతలూ ఒకరినొకరు పరుష పదజాలంలో విమర్శించుకోవడం వల్ల.. చర్చ ఆద్యంతం రసాభాసగా సాగింది.
ఇదీ చూడండి:ట్రంప్ X బైడెన్: వాడీవేడిగా తొలి డిబేట్
మైక్ కట్ చేయాలి..
ఈ నేపథ్యంలో సంవాదంలో ఎలాంటి రచ్చ జరగకుండా.. ఒకరి ప్రసంగానికి మరొకరు అడ్డుపడకుండా మైక్‌ను కట్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు ‘మ్యూట్ బటన్’ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరు జోక్యం చేసుకోకుండా ఇది అడ్డుపడుతుంది.
ట్రంప్ బృందం అభ్యంతరం
కమిషన్ తాజా నిర్ణయం పట్ల ట్రంప్ బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలి నుంచి పక్షపాతంగా వ్యవహరిస్తున్న డిబేట్ కమిషన్ తమ అనకూల అభ్యర్థి బైడెన్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించింది. అయినా, చర్చలో పాల్గొంటామని స్పష్టం చేసింది.
రెండో సంవాదం రద్దు..
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులు బహిరంగంగా ముఖాముఖి చర్చించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ చర్చలను 'కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్'(సీపీడీ) నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ట్రంప్, బైడెన్‌ల మధ్య తొలి సంవాదం సెప్టెంబరు 29న జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకే ట్రంప్ కరోనా బారినపడ్డారు. అనంతరం ఆయన కోలుకున్నప్పటికీ.. రెండో చర్చను వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ట్రంప్ విముఖత వ్యక్తం చేయడం వల్ల దానిని రద్దు చేశారు. ఈ నెల 22న తుది ముఖాముఖి చర్చకు రంగం సిద్ధమవుతోంది.
ఇదీ చూడండి:ట్రంప్ X బైడెన్: కరోనా విషయంలో అబద్ధాలు ఎవరివి?