డొనాల్డ్ ట్రంప్... పన్ను తగ్గింపు, రెగ్యులేటరీ కోతల హామీలతో తనని తాను సంప్రదాయవాదిగా చెబుతున్నారు. అదే సమయంలో బైడెన్‌ను సోషలిస్ట్ వ్యంగ్య చిత్రంగా అభివర్ణిస్తున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవటానికి, ఆర్థిక వ్యవస్థను పునర్ నిర్మించడానికి.. శతాబ్దాలుగా పట్టిపీడిస్తున్న జాత్యహంకారం, అసమానతలను తొలగించేలా సమాఖ్య ప్రభుత్వాన్ని నడిపిస్తానని ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ చెబుతున్నారు.రెండు పూర్తి విభిన్న విధానాల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం అమెరికన్లకు వచ్చింది.
అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి శ్వేతసౌధంలో అడుగుపెడితే పన్నుల విషయంలో ఎలా వ్యవహరిస్తామనేది, అలాగే.. అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామనేది ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో బైడెన్‌ది వామపక్ష భావజాలం అంటూ విరుచుకుపడుతున్నారు.
మరోవైపు పూర్తిగా సామాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కరోనా సహా వివిధ సమస్యలపై కలిసికట్టుగా పోరాడదామని బైడెన్ పిలుపునిస్తున్నారు. ట్రంప్ చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుతామని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో దేశంలోని కీలక సమస్యలపై వీరి వైఖరి ఎలా ఉంటుంది అనే దానిపై ఆసక్తికరంగా మారింది.
కరోనా వైరస్..
కరోనా అమెరికాను అతలాకుతలం చేసిన నేపథ్యంలో.. వైరస్‌పై పోరు ఇరువురు నేతల భవిష్యత్తు నిర్ణయించటంలో కీలకంగా మారింది.
ట్రంప్
- కరోనా మహమ్మారిని సమర్థంగా నిలువరించటంలో ట్రంప్ విఫలమయ్యారన్న వాదనలున్నాయి.
- కరోనావైరస్ను ట్రంప్ తక్కువ చేసి చూపించారని.. అమెరికన్లు గుర్రుగా ఉన్నారు.
- ట్రంప్ మరోసారి ఎన్నిక కావడంలో కరోనానే కీలకంగా నిలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడిన వేళ ఆధ్యక్షుడికి వైరస్ సోకటం ప్రతికూలంగా మారే అవకాశముంది.
- 10 మందిలో ఏడుగురు అమెరికన్లు కరోనాపై పోరులో దేశం తప్పటడుగు వేసిందని భావిస్తున్నారు. కేవలం 39శాతం మంది ట్రంప్ పనితీరును సమర్థించారు.
- మార్చి-ఏప్రిల్‌లో అమెరికన్ కాంగ్రెస్ 3ట్రిలియన్ డాలర్లు నిధులు విడుదల చేసింది.
- దేశవ్యాప్త పరిస్థితులపై ట్రంప్‌నే బాధ్యులుగా చూస్తున్నారు.
బైడెన్
- ట్రంప్ విధానాలను బైడెన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైరస్‌పై పోరులో పూర్తిగా అధ్యక్షుడు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.
- రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలతో పాటు వ్యాపారాలకు సహాయం చేయడానికి సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేస్తానంటున్నారు బైడెన్.
- ఆపత్కాలంలో డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ పనితీరు సమీక్షిస్తామని హామీ ఇస్తున్నారు.
- శాస్త్రవేత్తలు, వైద్యులు ప్రజలకు నిరంతరం సూచనలు అందించే వ్యవస్థ తీసుకొస్తామంటున్నారు.
- ప్రపంచ ఆరోగ్య సంస్థలోకి అమెరికాను తిరిగి చేరుస్తామని, దేశవ్యాప్తంగా మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేస్తామని చెబుతున్నారు.
విద్యావ్యవస్థ
విద్యా వ్యవస్థ, పాఠశాలల నిర్వహణపై కరోనా తర్వాత అమెరికాలో అనేక సందేహాలు రెకెత్తాయి. వీటి పరిష్కారం ఎన్నికల్లో కీలకాంశంగా మారింది.
ట్రంప్
- పాఠశాలలు పూర్తిగా తెరవాలని ట్రంప్ ఆదేశించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.
- ప్రాథమిక పాఠశాలలు వీలైనంత త్వరగా తెరవాలని సూచిస్తున్నారు.
- అయితే పాఠశాలలు తెరవటం వెనుక ట్రంప్ మతలబు వేరుగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో నిడిచే ఛార్టర్ స్కూల్లకు గ్రాంట్ల రూపంలో నిధులు అందుతాయి. పాఠశాలలు తెరిస్తే.. వారికి నిధులు అందించి ఆకట్టుకోవాలని ట్రంప్ చూస్తున్నారంటున్నారు పరిశీలకులు.
- విశ్వవిద్యాలయాలు విద్యార్థులపై వామపక్ష భావజాలాన్ని రుద్దుతున్నాయని ఆరోపిస్తున్నారు. వాటికి అందించే నిధులు, పన్నుల మినహాయింపుపై సమీక్ష జరపాలనే ఆలోచనలో ఉన్నారు.
బైడెన్
- కరోనా కారణంగా మరిన్ని నిధులు విద్యాసంస్థలకు అందించాలని బైడెన్ సూచిస్తున్నారు. సమాఖ్య చట్టం ద్వారా.. విపత్తుల సమయంలో సాయమందిస్తామని చెబుతున్నారు.
- తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వ చేయూతనందిస్తామని చెబుతున్నారు. పదేళ్లలో 850బిలియన్ డాలర్లు ఖర్చు చేసేలా బృహత్తర ప్రణాళిక రూపొందించారు.
- విద్యసంస్థల్లో మౌలిక సదుపాయాల పెంపు, అల్పాదాయ వర్గాలకు ఉన్నత విద్య వంటి అంశలపై ప్రత్యేక దృష్టి సారిస్తామంటున్నారు.
ఆరోగ్య సంరక్షణ
కరోనా వైరస్ విలయం తర్వాత... దేశ ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. అలాగే, ఒబామా హెల్త్‌కేర్ చర్చనీయాంశమైంది. ప్రజలతో ముడినపడిన ఈ అంశంలో అధ్యక్ష అభ్యర్థుల వైఖరి అందరి దృష్టి ఆకర్షిస్తోంది.
ట్రంప్
- అధ్యక్షుడు అవ్వకముందు ట్రంప్.. 2016లో ప్రచారంలో భాగంగా అధికారంలోకి వస్తే.. ఒబామా హెల్త్‌కేర్ స్థానంలో అందిరికీ బీమా అందించే పథకం తీసుకొస్తామని చెప్పారు.
- అమెరికన్లు ఇప్పటికీ కార్యరూపం దాల్చని ఆ కొత్త ఆరోగ్య పథకం కోసం ఎదురుచూస్తున్నారు.
- ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి ఈ అంశంపై హామీలు గుప్పిస్తున్నారు ట్రంప్. ధరల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెబుతున్నారు.
- వైద్యవ్యవస్థలో పారదర్శకత తీసుకొస్తామని స్పష్టం చేస్తున్నారు.
బైడెన్
- ఒబామా కేర్‌ను మరింత విస్తరిస్తామని బైడెన్ చెబుతున్నారు. ప్రజలకు సేవలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తామంటున్నారు.
- బీమా సౌకర్యం అందిరికీ కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించామని చెబుతున్నారు. 10 ఏళ్లలో 750బిలియన్ డాలర్లు ఖర్చు చేసేలా కార్యాచరణతో ముందుకొచ్చారు.
- సుప్రీం కోర్టులో ఆరోగ్య సంరక్షణ విధానాలపై పోరాడుతామని చెబుతున్నారు.