అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ప్రత్యర్థి జో బైడెన్ మధ్య రసవత్తరంగా సాగుతోన్న ఈ పోటీలో.. పైచేయి ఎవరిదనే అంశం అంతకంతకూ ఉత్కంఠకరంగా మారుతోంది. పోలింగ్‌కు మరో రెండు వారాలు కూడా లేని ఈ సందర్భంలో.. డెమొక్రాట్లదే ఆధిపత్యమంటున్న సర్వేలు రిపబ్లికన్లను కలవరపెడుతున్నాయి.
- నవంబర్ 3- ఎలక్షన్ డే
- అక్టోబర్ 23- అధ్యక్ష అభ్యర్థుల చివరి సంవాదం
ప్రస్తుతం ఇరు వర్గాల దృష్టి రెండో డిబేట్‌కు ముందు మిగిలిన ఉన్న రెండు రోజులపైనే ఉంది.
అధ్యక్షుడు ట్రంప్.. ఎన్నికల్లో తాను ఓడిపోవడం గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మరోవైపు బైడెన్ డెమొక్రాట్ల మద్దతుదారులను.. గెలుపుపై అతివిశ్వాసం ప్రదర్శించొద్దని వారిస్తున్నారు. ఎన్నికల రోజు దగ్గరపడుతుంటే ప్రస్తుతం పరిస్థితులు ఇలా కనిపిస్తున్నాయి.
ట్రంప్ సభలకు భారీగా జనం వస్తున్నారు. బైడెన్ చిన్నపాటి సమావేశాలకే పరిమితమవుతున్నారు. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చివరి దశలో ఉన్న ప్రచారం.. మరింత జోరందుకోనుంది. మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రచారంలోకి దిగుతుండటం బైడెన్ వర్గంలో కొత్త ఉత్సాహం నింపుతోంది. అయితే, గురువారం జరగనున్న చివరి సంవాదంపై ట్రంప్ వర్గం ప్రత్యేక దృష్టి సారించింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇదే చివరి అవకాశంగా భావిస్తోన్న రిపబ్లికన్లు.. వేదికపై ట్రంప్ మ్యాజిక్ పనిచేయాలని ప్రార్థిస్తున్నారు.
చివరి అవకాశమా ?
- గురువారం జరగనున్న మూడవ, చివరి డిబేట్.. ట్రంప్ వర్గానికి కీలకం కానుంది. ప్రస్తుతం డీలాపడిపోయిన ట్రంప్ ప్రచారం ఊపందుకోవాలంటే ఈ సంవాదం రిపబ్లికన్ల అంచనాల మేరకు జరగాల్సిందే. లేదంటే.. ఎన్నికలకు ముందు ప్రతికూల పవనాలు వీచే అవకాశముంది.
- మొదటి సంవాదంలో ట్రంప్ అనుసరించిన కోపం, దూకుడు విధానాలు చేటు చేశాయి. బైడెన్‌కు తొలి డిబేట్ బాగా కలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమైంది. కాబట్టి ట్రంప్ మరో తప్పు చేసి ప్రత్యర్థి నెత్తిన పాలు పోయలేరు.
- బైడెన్‌పైనా ఒత్తిడి ఉంది. ఆయన వయసు, మానసిక ఆరోగ్యంపై ట్రంప్ చేస్తున్న విమర్శలు ఇరకాటంలోకి నెడుతున్నాయి.
ఓటింగ్‌పై కరోనా కొత్త కేసుల ప్రభావం!
సరిగ్గా ఎలక్షన్ డేకు రెండు వారాల ముందు, కరోనా ఉద్ధృతి జులైనాటి స్థాయిలో పెరిగింది. దాదాపు 10 రాష్ట్రాలు ఒక్క రోజులో అత్యధిక కేసుల రికార్డులను తిరగరాస్తున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ఉద్ధృతితో రోజుకు లక్ష కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఇది దేశానికి అన్ని విధాలా సమస్యలు సృష్టిస్తోంది. ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. వైరస్ నియంత్రణలో ట్రంప్ పనితీరుపై మరోసారి ప్రశ్నలు రానున్నాయి. మరోవైపు ప్రజలు ఓటింగ్ కన్నా.. తమను తాము వైరస్ నుంచి రక్షించుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.
ముందస్తు పోలింగ్ ఇప్పటికే రికార్డు స్థాయిలో జరుగుతోంది. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఇలా ఎంతవరకు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఎక్కువ మంది 'మెయిల్' ఓటింగ్వైపు మొగ్గుచూపితే ఎన్నికల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.
రిపబ్లికన్ల నిధులకేమైంది ?
గెలిచినా, ఓడిపోయినా... ప్రస్తుతం ట్రంప్ ఎన్నికల ఖర్చులు, అంతంతమాత్రంగానే ఉన్న నిధులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చివరి దశ ప్రచారంలో.. ట్రంప్ మద్దతుదారులు ప్రకటనలపై 70.7 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు. మరోవైపు డెమొక్రాట్లు దాదాపు 141మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నారు.