అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా బుధవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన తొలి సంవాదంలో తానే గెలిచానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. జో బైడెన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించినట్లు చెప్పుకొచ్చారు.
"గత రాత్రి(అమెరికా సమయం ప్రకారం మంగళవారం రాత్రి) ప్రతి అంశంలో డిబేట్ మేమే గెలిచాం. అతను(బైడెన్) చాలా బలహీనంగా కనిపించారు. ఆయన కూనిరాగాలు తీశారు. నేను గమనించిన ప్రతీ పోల్‌లో మేమే విజయం సాధించాం. ఆరు పోల్స్ వివరాలను చూశాను, ప్రతీదాంట్లో మాదే విజయమని తేలింది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
త్వరలో ఫ్లోరిడా, టెన్నసీలో జరగనున్న మరో రెండు డిబేట్ల కోసం వేచి చూస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
"అతనితో డిబేట్లో పాల్గొనడాన్ని నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. సంవాదం నుంచి తప్పుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు విన్నాను. ఏమో, అది ఆయన ఇష్టం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
మరోవైపు, డిబేట్లో జరిగిన ప్రసంగం రాజకీయ హింసను ప్రేరేపించే మితవాద పక్షాలైన 'ప్రౌడ్ బాయ్స్'లో ఉత్తేజం కలిగించిందన్న కథనాలను ట్రంప్ కొట్టిపారేశారు. తనకు ప్రౌడ్ బాయ్స్ అంటే ఎవరో తెలీదని, చట్టం తన పని చేసుకుంటూ పోతుందని అన్నారు. ఎవరైనా చట్టం ముందు తలవంచాల్సిందేనని స్పష్టం చేశారు. హింసాత్మక అతివాద వామపక్ష సంస్థ అయిన 'ఆంటిఫా'తోనే అసలు సమస్య ఉందని, ఓట్లు కోల్పోతామన్న భయంతో ఈ విషయంపై బైడెన్ ఏమాత్రం మాట్లాడరని వ్యాఖ్యానించారు.