అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కాసేపు అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించనున్నారు. జో బైడెన్ శుక్రవారం కోలనోస్కోపీ పరీక్ష చేయించుకునే సమయంలో మత్తుమందు తీసుకుంటారు. ఆ సమయంలో అమెరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా కమల వ్యవహరిస్తారు. ఈ మేరకు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జెన్ సాకీ వెల్లడించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం బైడెన్ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం వాషింగ్టన్లోని మెడికల్ సెంటర్కు వెళ్లారు.
2002, 2007లోనూ అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఇదే ప్రక్రియను అనుసరించారని సాకీ గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు బైడెన్ కూడా కమలకు కాసేపు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని చెప్పారు. ఆ సమయంలో ఆమె ఉపాధ్యక్ష కార్యాలయం నుంచి బాధ్యతలు నిర్వరిస్తారని పేర్కొన్నారు.
78 ఏళ్ల బైడెన్ 2019లో చివరిసారిగా ఈ పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యం తో ఉన్నారని, అధ్యక్ష పదవికి అర్హులని వైద్యులు తెలిపారు. బైడెన్ శనివారం 79వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ వయస్సులో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం.