US population: జనాభా పెరుగుదల లేక సతమతమవుతున్న అమెరికాను కరోనా మహమ్మారి మరింత కుంగతీసింది. కొవిడ్ వ్యాప్తి మొదలైన తర్వాత అమెరికాలో జనాభా వృద్ధి రేటు భారీగా పడిపోయింది. కరోనా కారణంగా వలసలు తగ్గిపోవడం, చాలామంది గర్భధారణను వాయిదా వేయడం, కరోనా ధాటికి వందలాది అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడం కారణంగా.. జనాభా వృద్ధి మందగించింది.
Us Census: 2020 జులై నుంచి 2021 జులై మధ్య అమెరికా జనాభా 0.1 శాతమే పెరిగింది. అంటే.. 3,92,665 మంది మాత్రమే జన్మించారు. ఈ గణాంకాలను అమెరికా సెన్సస్ బ్యూరో మంగళవారం విడుదల చేసింది. 1937 తర్వాత అమెరికాలో 10 లక్షల కంటే తక్కువ జననాలు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
America population crisis: "జననాల రేటు, అంతర్జాతీయ వలసలు తగ్గడం కారణంగా అమెరికాలో చాలా ఏళ్లుగా జనాభా వృద్ధి మందగిస్తోంది. అదే సమయంలో దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండడం వల్ల మరణాలు రేటు పెరుగుతోంది. ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రభావంతో.. జనాభా వృద్ధి రికార్డు స్థాయిలో మందగించింది" అని సెన్సస్ బ్యూరో డెమోగ్రాఫర్ క్రిస్టీ వైల్డర్ పేర్కొన్నారు.