డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్.. తనకు విరాళాలు అందజేసినవారి జాబితాను ఆదివారం విడుదల చేశారు. ఈ ఏడాది తన ప్రచారం కోసం కనీసంగా లక్ష డాలర్ల వరకు అందజేసిన దాతల పేర్లను వెల్లడించారు. ఈ జాబితాలో మొత్తం 800 మంది ఉండగా.. అందులో భారతీయ అమెరికన్లు కూడా పలువురు ఉన్నారు.
స్వదేశ్ ఛటర్జీ, రమేశ్ కపూర్, శేఖర్ నరసింహన్, రంగస్వామి, అజయ్ భూటోరియా, ఫ్రాంక్ ఇస్లాం తదితరులు బైడెన్‌కు నిధులు సమకూర్చిన వాళ్లలో ముఖ్యులు. అయితే, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్‌కు విరాళాలు అందించిన వాళ్లలో చాలామంది బైడెన్ విషయంలో మారిపోయారు. డెమొక్రాట్లకు ప్రతిసారి నిధులు సమకూర్చే సంత్ ఛట్వాల్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో లేరు.
నేతలు, హాలీవుడ్ ప్రముఖులు..
బైడెన్‌కు నిధులు సమకూర్చిన వాళ్లలో ప్రస్తుత, మాజీ గవర్నర్లు, సెనేటర్లు, మంత్రులతో పాటు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సినీ నిర్మాత జెఫ్రీ కాటెన్బర్గ్, దర్శకుడు లీ డేనియల్స్, లింక్డ్ఇన్ సహా వ్యవస్థాపకులు రీడ్ హాఫ్మన్, మీడియా మొఘల్ హైమ్ సబన్, మాజీ వాణిజ్య మంత్రి పెన్నీ ప్రిట్జ్కర్ ఉన్నట్లు తెలిపింది.
నిధుల సేకరణలో రికార్డు..
అమెరికా అధ్యక్ష అభ్యర్ధుల్లో బిలియన్ డాలర్ల విరాళాలను సేకరించిన మొదటి అభ్యర్థిగా బైడెన్ నిలవనున్నారు. అక్టోబర్ 14 వరకు బైడెన్ 93.8 కోట్ల డాలర్లు సేకరించగా.. అధ్యక్షుడు ట్రంప్‌కు 59.6 కోట్ల డాలర్లు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే బైడెన్ 70 కోట్ల డాలర్లు సేకరించారు.
ఇదీ చూడండి:అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు!