అమెరికా ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కుటుంబంలోని పెద్దలకు 1000 డాలర్లు, చిన్నారులకు 500 డాలర్ల చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
కరోనాపై పోరుకు ఇప్పటికే 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు ట్రంప్. ఈ నగదు బదిలీ ప్రక్రియ కూడా ప్యాకేజీలో భాగమేనని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ నుచిన్ వెల్లడించారు. దీని మొత్తం వ్యయం 500 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
"కుటుంబంలో నలుగురు ఉంటే.. వారికి 3వేల డాలర్లు అందుతాయి. కాంగ్రెస్ దీనికి ఆమోదం తెలిపిన మూడు వారాల్లో ఇది అమలవుతుంది. ఆరు వారాల తర్వాత కూడా దేశంలో జాతీయ విపత్తు పరిస్థితులు కొనసాగితే.. మరో 3వేల డాలర్లు అందిస్తాము. నిత్యం శ్రమించే ఎందరో అమెరికన్లు.. వాళ్ల తప్పేమీ లేకున్నా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నిధులు వారి కోసమే."
--- స్టీవెన్ నుచిన్, అమెరికా మంత్రి
ఈ ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీలోని 300 బిలియన్ డాలర్లను చిన్న వ్యాపారాల మనుగడకు, మరో 200 బిలియన్ డాలర్లను ఎయిర్‌లైన్స్‌తో పాటు ఇతర రంగాలకు కేటాయించనున్నట్టు స్పష్టం చేశారు స్టీవెన్ నుచిన్.