కొవిడ్ వ్యాప్తితో సతమతమవుతున్న అమెరికాలో.. భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి పెద్ద ముందడుగు పడింది. ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా విస్తృత వినియోగానికి అమెరికా ప్రభుత్వ నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. నిపుణుల కమిటీ సిఫారసుకు.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ వ్యవస్థ (యూఎస్ఎఫ్డీఏ) ఆమోదం తెలపగానే ప్రజలకు టీకా ఇచ్చేందుకు.. అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
16 ఏళ్లు, ఆపైన ఉన్న యువతకు, పెద్దలకు అత్యవసర వినియోగానికి.. ఫైజర్-బయోఎన్‌టెక్ కొవిడ్ టీకా భద్రమైనది, సమర్థమంతమైనదని 17-4ఓట్ల తేడాతో నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. కమిటీలో ఒకరు ఓటింగ్‌కు.. గైర్హాజరయ్యారు. బ్రిటన్‌లో టీకా తీసుకున్న ఇద్దరు అలెర్జీకి గురయ్యారనే వార్తల మధ్య.. అమెరికా నిపుణుల కమిటీ ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.