అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం నిరసనలతో హోరెత్తింది. పోర్ట్‌ల్యాండ్‌లో జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించడం వల్ల.. నిరసనలు మరింత హింసాత్మకంగా మారాయి. అయితేే మృతుడు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఫెడరల్ అధికారులు.. ఎలాంటి బ్యాడ్జ్‌లు, నేమ్ ట్యాగ్లు లేకుండానే ఆందోళనకారుల్ని చట్ట విరుద్ధంగా అదుపులోకి తీసుకుంటున్నారనే కారణంతో పోర్ట్‌ల్యాండ్‌లో ఘర్షణ నెలకొంది.
ఈ ఘటనను డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే విధంగా చేయాలని ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు.
'పోర్ట్‌ల్యాండ్ హింసాత్మక ఘటన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. అమెరికా లాంటి గొప్ప దేశంలోని నగర వీధుల్లో ఇలా కాల్పులు జరగడం దురదృష్టకరం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ట్రంప్ కూడా అలాగే చేయాలని సవాల్ చేస్తున్నా.'
- జో బైడెన్, డెమొక్రటిక్ పార్టీ