US China: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. పలు నగరాల్లో బాంబులు, క్షిపణుల మోత మోగుతూనే ఉంది. రష్యాను అడ్డుకునేందుకు ఇప్పటికే ప్రపంచ దేశాలు వేల కొద్దీ ఆంక్షలు విధించినప్పటికీ.. క్రెమ్లిన్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. పుతిన్ వ్యవహారంపై చర్చించేందుకు నేడు చైనాతో భేటీ కానుంది. అయితే సమావేశానికి కొద్ది గంటల ముందు అమెరికా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో రష్యా.. చైనా సాయం కోరుతోందని, ఆయుధాలు ఇవ్వాలని అడిగిందని ఆ అధికారి ఆరోపించారు.
"ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా.. మరింత ముందుకెళ్లేందుకు ఇటీవల చైనా సాయం కోరినట్లు తెలిసింది. సైనిక పరికరాలు, ఆయుధాలు ఇవ్వాలని అభ్యర్థించింది" అని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది. అయితే చైనా సాయం ఎందుకు కోరిందన్న వివరాలను మాత్రం సదరు అధికారి చెప్పలేదని పేర్కొంది.
US China Meet:
అయితే ఈ ఆరోపణలను చైనా ఖండించింది. తమ నుంచి రష్యా ఎలాంటి సాయం కోరలేదని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి లీ పెంగ్యూ వెల్లడించారు. "ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు తీవ్ర ఆందోళన కరంగా ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా కాకుండా అడ్డుకోవడమే ఇప్పుడు చైనా ముందున్న ప్రథమ ప్రాధాన్యత" అని లీ అన్నారు.