నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ను మోకాలితో తొక్కి చంపడంపై అమెరికావ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆఫ్రికన్ అమెరికన్లు అనేక రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు. అట్లాంటా, వాషింగ్టన్, మిన్నెపొలిస్ సహా వివిధ రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి.
డెట్రాయిట్ నగరంలో ఆందోళనలను అణిచేందుకు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఫీనిక్స్, డెన్వర్, లాస్ వెగాస్, లాస్ ఏంజిల్స్ నగరాల్లో వేలసంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడారు. 'న్యాయం జరిగే వరకు శాంతించేది లేదు' అంటూ నినాదాలు చేస్తున్నారు.
అట్లాంటాలో హింసాత్మకంగా..
అట్లాంటాలో చాలా సమయం పాటు శాంతియుతంగా జరిగిన నిరసన ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసుల కార్లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. సీఎన్ఎన్ ప్రధాన కార్యాలయం వద్దనున్న లోగో సహా ఓ రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. పోలీసులే లక్ష్యంగా బాటిళ్లు, చాకులు, బొమ్మ తుపాకులను విసిరారు. 'ఇంకా ఎంతమంది ఇలా బలవ్వాలి' అని నినదించారు. నిరసనలు చేస్తున్న పలువురిని అరెస్టు చేశారు పోలీసులు.
రిపోర్టర్లు అరెస్ట్.. గవర్నర్ క్షమాపణలు
మిన్నెసోటాలో నిరసనలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సీఎన్ఎన్ పాత్రికేయులు, సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లైవ్‌లో ప్రసారమైన ఈ వీడియో వైరల్‌గా మారి పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మిన్నెసొటా గవర్నర్ టిమ్ వాల్జ్ మీడియాకు క్షమాపణలు తెలిపారు. ఆందోళనకారుల్లో రిపోర్టర్లు కూడా భాగమని భావించి అరెస్ట్ చేసినట్లు ఘటనపై వివరణ ఇచ్చారు అధికారులు.