చిన్నపాటి విమానాలను ధ్వంసం చేయగలిగే శక్తిమంతమైన లేజర్ ఆయుధాన్ని అమెరికా నావికా దళం విజయవంతంగా పరీక్షించింది. యూఎస్ఎస్ పోర్ట్‌ల్యాండ్ రవాణా నౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అమెరికా నావికా దళ పసిఫిక్ ఫ్లీట్ విడుదల చేసింది.
అయితే ఈ లేజర్ ఆయుధ వ్యవస్థ పరీక్ష(ఎల్డబ్ల్యూఎస్డీ)లు జరిపిన నిర్దిష్ట ప్రదేశం గురించి వివరాలు చెప్పనప్పటికీ... మే 16న పసిఫిక్ మహా సముద్రంలో ప్రయోగించినట్లు నావికా దళం పేర్కొంది.
ఆయుధాల్లో లేజర్ వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో భాగంగా డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాల(డీఈడబ్ల్యూ)ను 1960 నుంచి అభివృద్ధి చేస్తోంది అమెరికా నౌకాదళం.
ఈ డీఈడబ్ల్యూ ఆయుధాలు రసాయన, విద్యుత్ శక్తిని రేడియేటెడ్ ఎనర్జీగా మార్చి లక్ష్యంపై దాడి చేస్తాయని.. తద్వారా శత్రువుల లక్ష్యాన్ని నాశనం చేస్తాయని యూఎస్ నేవీ వెల్లడించింది.