కొవిడ్ సంక్షోభంలో భారత్‌లో వైద్యసహాయం అందించేందుకు అమెరికా ఓ మెర్సీషిప్‌ను పంపించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా చట్ట సభ సభ్యురాలు షీలా జాక్సన్ లీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. "భారత్‌కు మానవతా సాయం ప్రకటించాము. ఓ మెర్సీషిప్‌ను పంపించాలని ప్రతిపాదించాము. భారత్‌లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. ఆ దేశానికి అన్ని విధాలా సాయం చేసేందుకు మేం కలిసి పనిచేస్తాం" అని ఆమె ట్వీట్ చేశారు. షీలా జాక్సన్ బుధవారం హూస్టన్‌లోని 'ది యునైటెడ్ మెమోరియల్ మెడికల్ సెంటర్' నుంచి భారత్‌కు అవసరమైన సహాయ పరికరాలు పంపే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
అమెరికా కాంగ్రెస్ వుమెన్ కేథరిన్ క్లార్క్ మాట్లాడుతూ "భారత్‌లో సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా సాధ్యమైనంత వరకు కృషి చేయాలి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ బారినపడి ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా పనిచేయాలి" అని తెలిపారు.
ఇండో-అమెరికన్ కాంగ్రెస్‌మెన్ రాజా కృష్ణమూర్తి బుధవారం అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధుతో భేటీ అయ్యారు. అనంతరం తరణ్‌జీత్ సింగ్ సంధు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ''ఈ కష్టకాలంలో భారత్‌కు అండగా ఉన్న కాంగ్రెస్ సభ్యుడికి ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు.