అమెరికా తయారీ రంగంలో మాంద్యం మరింత పెరిగిపోయింది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గుదల, వాణిజ్య యుద్ధాలతో.. తయారీ రంగంలో వృద్ధి 2009 అనంతరం మరోసారి ఆ స్థాయిలో కనిష్ఠాన్ని నమోదు చేసినట్లు పరిశ్రమ సర్వే వెల్లడించింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది.
చైనాతో వాణిజ్య యుద్ధం, ప్రజల కొనుగోలు సామర్థ్యం మందగమనంతో పాటు ప్రధాన కర్మాగారాల్లో తయారైన వస్తువుల అమ్మకాలు తగ్గాయి. ఫలితంగా ఇన్స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్మెంట్(ఐఎస్ఎం) సూచీ అనూహ్యంగా పడిపోయింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగించే మరో సంకేతమని సర్వే పేర్కొంది.
ఐఎస్ఎం సూచీ సెప్టెంబరులో 1.3 శాతం క్షీణించి 47.8 శాతంగా నమోదైంది. 2009 జూన్ తర్వాత ఇదే అత్యంత కనిష్ఠం. సాధారణంగా ఐఎస్ఎం సూచీ 50 శాతానికిపైగా నమోదైతే వృద్ధిగా పరిగణిస్తారు.