మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని వీడబోయే డొనాల్డ్ ట్రంప్ చివరి రోజుల్లో విపరీత చర్యలకు పాల్పడుతూ భంగపాటుకు గురవుతున్నారు. తాజాగా అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా మారింది. తాజా ఘటనతో అటు డెమొక్రాట్లతో పాటు సొంత పార్టీలోని నేతల నుంచి కూడా ట్రంప్‌పై వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ట్రంప్ కేబినెట్ భావిస్తున్నట్లు సమాచారం. క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్‌ను తొలగించే అంశంపై సాధ్యాసాధ్యాలను కేబినెట్ సభ్యులు చర్చిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వేటుకు అవకాశం ఉందా..?
అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి అభిశంసన తీర్మానం.. రెండోది అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ అధికారం. ఈ రెండింటిలో ఏ ప్రక్రియ జరిగినా.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంతవరకు ఉపాధ్యక్షుడు అధ్యక్ష హోదాలో తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 25వ సవరణ అధికారంపై కేబినెట్ సభ్యులు చర్చిస్తున్నట్లు సమావేశం. ట్రంప్ పాలనపై నియంత్రణ కోల్పోయారని, అందుకే ఆయనను పదవి నుంచి తొలగించాలనుకుంటున్నట్లు రిపబ్లికన్ నేతలు చెప్పడం గమనార్హం.
భంగపాటు తప్పదా..!
కొత్తగా ఎన్నికైన జో బైడెన్ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే ఎన్నికల్లో తన ఓటమిని ఇంతవరకూ ఒప్పుకోని ట్రంప్.. శాంతియుతంగా అధికార మార్పడికి సహకరించట్లేదు సరికదా.. బైడెన్ గెలుపును అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో బైడెన్ ఎన్నికను వ్యతిరేకించాలంటూ రిపబ్లికన్ నేతల మద్దతు కూటగట్టుకునే ప్రయత్నం చేయగా అది పూర్తిస్థాయిలో ఫలించలేదు. ఇలాంటి సమయంలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేయగా.. ఆయనపై వ్యతిరేకత తారస్థాయికి చేరుకుంది. దీంతో జనవరి 20 కంటే ముందే ఆయనను పదవి నుంచి తొలగించాలని యూఎస్ కేబినెట్ మంతనాలు జరుపుతోంది. అదే జరిగితే ట్రంప్‌నకు అవమాన భారం తప్పదు.