కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న భారత్కు వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లు సరఫరా చేయాలని అమెరికా చట్టసభ్యులు, గవర్నర్లు జో బైడెన్ యంత్రాంగానికి సూచించారు. ప్రస్తుతం భారత్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఈ సమయంలో ఆ దేశానికి సాయం అందించడం అమెరికా బాధ్యత అని పేర్కొన్నారు. విదేశాలకు అమెరికా వ్యాక్సిన్లను అందించేందుకు సిద్ధమైన నేపథ్యంలో చట్టసభ్యులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రిపబ్లికన్ నేత విమర్శ..
"అధ్యక్షుడు బైడెన్ చేపడుతున్న వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం లోపాలతో నిండి ఉంది. అమెరికాకు భారత్ ఎంతో సన్నిహిత దేశం. అటువంటి దేశాలకే ప్రధానంగా టీకా సాయం అందించాలి. వారికి సరిపడా వ్యాక్సిన్లు సమకూర్చాలి."
-టెడ్ క్రూజ్, రిపబ్లికన్ చట్టసభ్యుడు