అమెరికాలో ఉద్యోగాలను వదులుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో 45లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు అమెరికా కార్మిక శాఖ వెల్లడించింది. అక్టోబర్‌తో పోల్చుకుంటే ఉద్యోగాలు వదులుకున్నవారి సంఖ్య 3 లక్షలకు పెరిగింది.
మరోవైపు నవంబర్‌లో అమెరికాలో మొత్తంగా 1.6కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని కార్మిక శాఖ పేర్కొంది. అయితే ఈ సంఖ్య అక్టోబరులో 1.11 కోట్లు ఉండగా.. నవంబర్‌లో తగ్గింది.
కొత్త అవకాశాల కోసమే పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు. అధిక వేతనం లభించే మార్గాల వైపు దృష్టిసారిస్తున్నట్టు తెలుస్తోంది.
పుంజుకుంటున్న జాబ్ మార్కెట్
గతేడాది కొవిడ్ సంక్షోభం నుంచి అమెరికా జాబ్ మార్కెట్ బలంగా పుంజుకుంటోందనడానికి ఈ పరిణామాలు నిదర్శనమని చెప్పవచ్చు. కరోనా లాక్డౌన్ కారణంగా 2020 మార్చి ఏప్రిల్ నెలల్లో 2 కోట్ల 20 లక్షల మందికిపైగా ఉపాధి కోల్పోయారు. ఫలితంగా అప్పట్లో అగ్రరాజ్యంలో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో 14.8 శాతానికి పెరిగింది. అయితే కొవిడ్ నివారణ చర్యలతో జాబ్ మార్కెట్ పుంజుకుంది. గతేడాది ఏప్రిల్ నుంచి కోటీ 85 లక్షల మందికి ఉపాధి పొందారు. ప్రస్తుతం నిరుద్యోగం రేటు 4.2 శాతంగా ఉన్నట్లు అధికారిక అంచనా.
ఇదీ చూడండి:హైవేపై కి.మీ. మేర మంచు.. రాత్రంతా రోడ్లపైనే వాహనదారులు