తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాపై అమెరికా త్రిశూల వ్యూహం.? - US is in agreement on India and China boarder

భారత్-​ చైనా సరిహద్దు వివాదంపై అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇటీవల అన్నారు. ఇప్పటికే వైరస్​ వ్యాప్తి విషయంలో చైనాపై మండిపడుతోన్న ట్రంప్​​.. ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాను నిలువరించేందుకు అగ్రరాజ్యం రచిస్తోన్న వ్యూహం ఏంటి?

US is in agreement on the boarder dispute between India and China
చైనాపై పెద్దన్న త్రిశూల వ్యూహం.?

By

Published : May 28, 2020, 3:37 PM IST

పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాపై నెమ్మదిగా అంతర్జాతీయ సమాజం ఒత్తిడిని పెంచుతోంది. చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా ఈ అవకాశాలను వినియోగించుకోవడానికి కాచుకు కూర్చొంది. ఇప్పటికే కరోనావైరస్‌ వ్యాప్తి విషయంలో చైనాపై మండి పడుతున్న ట్రంప్‌ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు భారత్‌తో చైనాకు వివాదం తలెత్తినందున తాను మధ్య వర్తిత్వం చేస్తానని ప్రకటించారు. ట్రంప్‌ కనుక మధ్యవర్తిగా పరిణామాలు తనకేమీ అనుకూలంగా ఉండవని చైనాకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి బుధవారం ఝా లిజియాన్‌ స్పందించారు. సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా.. అదుపులోనే ఉందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఇరు దేశాలకు సరైన వ్యవస్థలు, సమాచార మాధ్యమాలు ఉన్నాయని వెల్లడించారు. నిన్న సాయంత్రం చైనా రాయబారి సున్‌ వుయ్‌డాంగ్‌ కూడా స్పందించారు. ఇరు దేశాల విభేదాలను ద్వైపాక్షిక సంబంధాలపై పడనీయమన్నారు. పరస్పర విశ్వాసం పెంపొందించుకుంటామని తెలిపారు.

అన్ని వైపుల నుంచి డ్రాగన్‌పై ఒత్తిడి..

చైనాపై అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. ఇటీవల వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీలో కరోనావైరస్‌ వ్యాప్తిపై దర్యాప్తునకు పలు దేశాలు మొగ్గు చూపాయి. అదే సమయంలో హాంకాంగ్‌లో 'జాతీయ భద్రతా చట్టం' ఆమోదం అయ్యేలా చేసింది చైనా. దీనికి అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమకారులకు తమ మద్దతు ఉంటుందని బహిరంగంగానే ప్రకటించింది. దీనికి తగ్గట్లే 'సైనో-బ్రిటీష్‌' ఒప్పందం ఉల్లంఘిస్తే చైనాపై ఆంక్షలు విధించేలా 'శాంక్షన్స్‌ బిల్‌ టు డిఫెండ్‌ హాంకాంగ్స్‌ అటానమీ'పై డెమొక్రాటిక్‌ సెనేటర్‌ క్రిస్‌ వాన్‌ హాలెన్‌, రిపబ్లికన్‌ సెనేటర్‌ పాట్‌ టూమెలు కసరత్తు చేస్తున్నారు.

మరోవైపు ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా స్పందించారు. చైనా అధీనంలో హాంకాంగ్‌ స్వతంత్రంగా ఉన్నట్లు ఇక అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోదని ప్రకటించారు. ఇది చైనాకు పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే అమెరికాతో వ్యాపారానికి హాంకాంగ్‌కు చాలా రాయితీలు లభిస్తాయి. చైనా వీటిని వినియోగించుకొని భారీగా వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తుంది. ఇప్పుడు వాటికి కష్టమైపోయే పరిస్థితి నెలకొంది.

టిబెట్‌పై అమెరికా కాంగ్రెస్‌ ఎదుట బిల్లు.!

చైనా అధీనంలో ఉన్న టిబెట్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించే అధికారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కట్టబెడుతూ.. అమెరికా ప్రతినిధుల సభకు చెందిన సభ్యుడు స్కాట్‌ పెర్రీ కాంగ్రెస్‌ ఎదుట బిల్లును ప్రవేశపెట్టారు. హాంకాంగ్‌పై కూడా అటువంటి బిల్లును ఆయన ప్రవేశపెట్టడం గమనార్హం. ఇది ఆమోదం పొందితే చైనాకు మరో కొత్త తలనొప్పి తయారు కావడం ఖాయం. దీనిపై భారత్‌లోని టిబెట్‌ ఉద్యమకారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే తైవాన్‌కు అమెరికా బహిరంగానే మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.

ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడానికి అమెరికాకు ప్రస్తుతం భారత్‌ ప్రధాన భాగస్వామి. అందుకే సబ్‌మెరైన్‌ హంటర్లైన రోమియో హెలికాప్టర్లను భారత్‌కు విక్రయిస్తోంది. ఈ దశలో చైనాతో సరిహద్దు వివాదం కారణంగా భారత్‌ బలహీన పడితే ఈ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు దెబ్బతింటాయి. చైనా ఆధిపత్యం పెరిగిపోతుంది. ఇది అమెరికాకు ఏమాత్రం ఇష్టంలేదు. అందుకే డ్రాగన్‌పై క్రమంగా ఒత్తిడి పెంచుతోంది. భారత్‌ కూడా గాల్వన్‌ లోయ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం వంటివి ఏమాత్రం ఆపమని ఇప్పటికే స్పష్టం చేసింది. హాంకాంగ్‌.. తైవాన్‌.. టిబెట్‌ రూపంలో చైనాపై అమెరికా త్రిశూల వ్యూహాం అమల్లోకి తెస్తోంది.

ఇదీ చదవండి:'భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నించొద్దు'

ABOUT THE AUTHOR

...view details