పశ్చిమాసియాలో రాజుకున్న అగ్గి... యుద్ధరూపు దాలుస్తుందని ప్రపంచమంతా భయపడుతోంది. ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్.. ఇరాక్‌లో అమెరికా సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకొని మంగళవారం 22 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడి అనంతరం అమెరికా తీవ్రంగా స్పందిస్తుందని అంతా ఊహించారు. అయితే అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి శాంతి మంత్రాలు జపించడం ఉద్రిక్త పరిస్థితులను కాస్త తగ్గించింది.
ప్రత్యక్ష దాడులు..
1979లో టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఇరాన్ స్వాధీనం చేసుకుంది. ఆ ఘటన తర్వాత మళ్లీ అమెరికాపై ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగడం ఇదే తొలిసారి. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిని చూస్తే అమెరికా దళాల ప్రాణాలే లక్ష్యంగా ఇరాన్ చర్యలు ఉన్నాయని అగ్రరాజ్యం రక్షణశాఖ పెంటగాన్ తెలిపింది.
ట్రంప్ శాంతి మంత్రాలు...
ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసిన తర్వాత శ్వేతసౌధం నుంచి ట్రంప్ ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ వెనక్కి తగ్గడం వారికీ, ప్రపంచానికి మంచిదని హితవు పలికారు.
"నేను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించేందుకు అనుమతించబోం. గత రాత్రి ఇరాన్ చేసిన దాడుల్లో ఏ అమెరికన్ ప్రమాదానికి గురి కాలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. మా సైనికులంతా సురక్షితంగా ఉన్నారు. మా సైనిక స్థావరాలు మాత్రమే స్వల్పంగా ప్రభావితమయ్యాయి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అమెరికన్ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ వెంటనే వెనక్కి తగ్గాలి. అదే అన్ని వర్గాలకు.. ప్రపంచానికి మంచిది." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇరాన్ దూకుడు...
ట్రంప్ శాంతి మంత్రాలు వల్లించిన గంటల వ్యవధిలోనే ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్ ప్రాంతంపై రాకెట్లతో దాడి జరిగింది. అమెరికా సహా విదేశీ రాయబార కార్యాలయాలుండే గ్రీన్ జోన్ ప్రాంతంపై రెండు రాకెట్లను ప్రయోగించినట్లు ఇరాక్ సైన్యం తెలిపింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.