తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాXఇరాన్: యుద్ధభూమిలో ఎవరి బలమెంత?

అమెరికా-ఇరాన్​ల మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇదే సమయంలో ఇరుదేశాల మధ్య యుద్ధం సంభవిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్​ దేశాల సైనిక శక్తి, బలాబలాలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు? ఎవరి బలమెంత? అన్న విషయాలపై సమగ్ర విశ్లేషణ.

US-Iran at war: Military strengths of two nations
అమెరికాXఇరాన్: యుద్ధభూమిలో ఎవరి బలమెంత?

By

Published : Jan 8, 2020, 9:04 PM IST

ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్ ఖాసీం సులేమానీని అమెరికా దళాలు హతమార్చిన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఖాసీం హత్యకు ప్రతీకారంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులతో అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది. ఇందులో 80 మంది అమెరికా సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు చర్చనీయాంశమవుతోంది. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సైన్యం అమెరికా సొంతమని... ఘటన తాలూకు నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఆయన ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే జరిగే పరిణామాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు అమెరికా-ఇరాన్​ సైనిక బలాబలాలపై విస్తృతమైన చర్చ నడుస్తోంది. యుద్ధం వస్తే ఎవరు పైచేయి సాధిస్తారు. గెలుపోటములు ఎవరిని వరిస్తాయనే దానిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్​ల సైనిక సంపత్తి, మిలటరీ బలగాలను పరిశీలిస్తే..

ఇరుదేశాల మిలటరీ బలాలు

'అగ్ర'రాజ్యమే

అమెరికా సైన్యం... ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైనది అన్న విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. సైనిక సంపత్తి పరంగా అగ్రరాజ్యం ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంటుంది. మరోవైపు ఇరాన్ ఈ జాబితాలో 14వ స్థానంలో ఉంది.

సైనిక బలగాలు

అమెరికాకు 12,81,900 సైన్యంతో పాటు 14,48,71,845 రిజర్వు బలగాలు ఉన్నాయి. ఇరాన్ వద్ద 5,23,000 సైన్యం సహా కేవలం 4,73,24,105 రిజర్వు బలగాలు అందుబాటులో ఉన్నాయి.
యుద్ధ ట్యాంకుల విషయంలోనూ అమెరికాదే పైచేయి. అగ్రరాజ్యం వద్ద 48,422 యుద్ధ ట్యాంకులు ఉంటే... ఇరాన్​ వద్ద కేవలం 8,577 ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. ఇరాన్​తో పోలిస్తే ఆరు రెట్లు యుద్ధ ట్యాంకులు అమెరికా సొంతం.

నావికా దళం

నావికా దళ విషయంలో మాత్రం అమెరికాకు ఇరాన్​ కాస్త పోటీగా ఉంది. అమెరికా వద్ద యుద్ధ నౌకలు, సబ్​మెరైన్​లు దాదాపు 415 ఉంటే... ఇరాన్​ వద్ద 398 నౌకలు ఉన్నట్లు సమాచారం.

వాయుసేన

వాయుసేన విషయంలో ఇరాన్​తో పోలిస్తే అమెరికా 20 రెట్లు శక్తిమంతంగా ఉంది. యూఎస్​ వద్ద 10,170 ఎయిర్​క్రాఫ్ట్​లు, హెలికాఫ్టర్లు ఉండగా... ఇరాన్​ వద్ద 512 యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి.

రక్షణ బడ్జెట్

సాయుధ దళాలు, రక్షణ రంగానికి కేటాయించే బడ్జెట్ విషయంలో ఇరుదేశాల మధ్య నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంది. అగ్రరాజ్యం దాదాపు 716 బిలియన్ అమెరికా డాలర్లను రక్షణ రంగానికి కేటాయింస్తుండగా... ఇరాన్ మాత్రం అమెరికాతో పోలిస్తే వంద రెట్లు తక్కువ ఖర్చు చేస్తోంది. కేవలం 6.3 బిలియన్ డాలర్లను రక్షణ రంగానికి కేటాయిస్తోంది.

ఈ గణాంకాల ప్రకారం ఏ రంగంలో చూసినా ఇరాన్​కు అమెరికా అందనంత ఎత్తులో ఉందన్న విషయం స్పష్టమవుతోంది. అయితే యుద్ధం వస్తే ఆ ప్రభావం ఈ రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై పడుతుందన్న విషయం విస్పష్టం.

ABOUT THE AUTHOR

...view details