'ఇరాన్‌తో ముప్పు... అందుకే బలగాల మోహరింపు' ఇరాన్‌తో ముప్పు పొంచి ఉందని ఆరోపిస్తూ మధ్యప్రాచ్యం(మిడిల్ ఈస్ట్)లో అదనపు బలగాలను మోహరించేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. సర్వసన్నద్ధులైన 1500మంది రక్షణ సిబ్బందిని మధ్య ప్రాచ్యానికి పంపేందుకు ఆదేశాలు జారీ చేసింది. అమెరికా చర్యలను ఇరాన్ ప్రభుత్వం తప్పుబట్టింది.
"మధ్యప్రాచ్యంలో అమెరికా ఉనికి పెరగడం అంతర్జాతీయ శాంతికి విఘాతం. గల్ఫ్ దేశాల్లో భద్రత మరింత దిగజారే అవకాశం ఉంది"
-మహ్మద్ జావెద్, ఇరాన్ విదేశాంగ మంత్రి
తమ ఆస్తులను ధ్వంసం చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందన్న అనుమానాలతోనే తాజా నిర్ణయం తీసుకుంది అమెరికా. ఇప్పటికే అబ్రహం లింకన్ యుద్ధ నౌక, బీ-52 శ్రేణి బాంబర్లను ఇరాన్ లక్ష్యంగా పంపింది. ఇరాన్ బద్ధ శత్రువైన సౌదీ అరేబియాకు కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఆయుధాలు విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
కొంత కాలంగా ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 2015 అణుఒప్పందం నుంచి అమెరికా స్వచ్ఛందంగా వైదొలగిన అనంతరం ఈ పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
మధ్యవర్తిత్వానికి ఇరాక్ సిద్ధం
ఇరాన్ కోరితే అమెరికాతో సయోధ్య కుదిర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాక్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ హల్బౌసీ ప్రకటించారు. బాగ్దాద్‌లో ఇరాన్ ఆర్థిక మంత్రి మహ్మద్ జావేద్ రెండు రోజుల పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు బౌసీ.
ఇదీ చూడండి: రయ్రయ్: సూపర్ కార్లన్నీ ఒకేచోటకు వస్తే...