కరోనా విజృంభణతో 'మెడికల్ గ్లవ్స్'కి ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో థాయిలాండ్లో పలు అక్రమ సంస్థలు పుట్టుకొచ్చాయని అమెరికాకు చెందిన ప్రముఖ వార్తాసంస్థ సీఎన్ఎన్ పేర్కొంది. ఈ సంస్థల ద్వారా.. దాదాపు కోటికి పైగా వాడేసిన 'నైట్రైల్' మెడికల్ గ్లవ్‌లు అమెరికాలోకి దిగుమతైనట్లు తమ పరిశోధనలో వెల్లడైందని సీఎన్ఎన్ తెలిపింది. వాడేసిన గ్లవ్స్ని కడిగి శుభ్రపరచి.. కొత్తవాటిలా కనిపించేలా చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఇప్పటికే మిలియన్ల కొద్దీ నకిలీ, సెకండ్ హ్యాండ్ నైట్రైల్ గ్లవ్‌లు అమెరికాతో పాటు వివిధ దేశాలకు రవాణా అయినట్లు 'సీఎన్ఎన్' విచారణలో వెల్లడైంది.
అలా వెలుగులోకి..
థాయ్‌లాండ్ నుంచి వచ్చిన మురికి గ్లవ్స్పై ఈ ఏడాది ప్రారంభంలో ఓ సంస్థ అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కి సమాచారం అందించింది. దీనితో విచారణ ప్రారంభమైనట్లు తెలిసింది. దాదాపు ఐదు నెలల తర్వాత థాయ్ కంపెనీకి చెందిన రక్షణ పరికరాలను అడ్డుకోవాలని అధికారులు ఆదేశించారు. జులై వరకు ఈ కార్యకలాపాలు కొనసాగినట్లు గుర్తించిన అధికారులు.. ఆమోదం పొందని ఉత్పత్తులు విక్రయించే వారిని నిలువరించేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు అమెరికా యంత్రాంగం తెలిపింది.