కరోనా వైరస్ మరోమారు విజృంభించకుండా చూసేందుకు నిర్ణయాత్మక చర్యలు చేపట్టకపోతే అమెరికాలో పరిస్థితి తీవ్రమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంఫ్లూయెంజా వైరస్‌తో కలిసి అమెరికా చరిత్రలో ఈ శీతకాలం చీకటిని మిగుల్చుతుందని తెలిపారు అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ రిక్ బ్రైట్.
హెచ్చరించినందుకే వేటు..
కరోనా వైరస్‌కు సంబంధించి సంసిద్ధంగా ఉండాలని ట్రంప్ ప్రభుత్వానికి హెచ్చరించిన కారణంగా తనను బాధ్యతల నుంచి తప్పించినట్లు బ్రైట్ ఆరోపిస్తున్నారు. సంక్షోభం ప్రారంభం సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధికి పెట్టుబడులు, ఔషధాల నిల్వలు పెంచాలని సూచనలకు ప్రతిగా తనకు విమర్శలు ఎదురయ్యాయని తెలిపారు. బ్రైట్‌ను తొలగించేందుకు ఆయన చేసిన సూచనలే కారణమంటూ అమెరికాకు చెందిన ఓ నిఘా సంస్థ కూడా మద్దతు పలికింది.
విధ్వంసం తప్పదు..
తనను బాధ్యతల నుంచి తప్పించడంపై అమెరికా చట్టసభ పరిధిలోని ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు బ్రైట్. కమిటీ ముందు ఇవాళ తన వాదనలు వినిపించనున్నారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలను కమిటీ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. తాము చేసిన సూచనలను పాటించకపోతే రాబోయే రోజుల్లో విధ్వంసం తప్పదని హెచ్చరించారు.