అమెరికా ఇమిగ్రేషన్‌కు సంబంధించి నూతన విధి విధానాలను ఈ రాత్రికి ప్రకటించనున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక నుంచి గ్రీన్‌కార్డును నైపుణ్యం ఉన్న వారే పొందేలా చర్యలు తీసుకోనున్నారు.
ప్రస్తుతం గ్రీన్‌కార్డు ఉన్న వారి కుటుంబసభ్యులకే ప్రాధాన్యమిస్తూ వస్తోంది అమెరికా. గ్రీన్ కార్డు పొందుతున్న వారిలో 66శాతం మంది అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి ఉన్నవారి బంధువులే. 12 శాతం మంది మాత్రమే నైపుణ్యం ఆధారంగా గ్రీన్ కార్డు పొందుతున్నారు. ఈ విధానం వల్ల వేల మంది భారతీయులకు నిరాశే ఎదురవుతోంది. హెచ్1బీ వీసా ఉన్న భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం సగటున దశాబ్దంపాటు వేచి చూడాల్సి వస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలకాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చాలంటే చట్టసభ సభ్యుల ఆమోదం అవసరం. ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్లు సుముఖంగా ఉన్నా, ప్రతిపక్ష డెమొక్రాట్లు మద్దతిస్తారనేది సందేహమే. ఒకవేళ డెమొక్రాట్లు తన ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు.
ప్రస్తుతం ఏటా 11లక్షల గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తోంది అమెరికా. ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే అందులో సగం మందికిపైగా నైపుణ్యం ఉన్న వారికే గ్రీన్‌కార్డు లభిస్తుంది. హెచ్1బీ వీసా ఉండి గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న వేల మంది భారతీయులు లబ్ధి పొందుతారు.
ఇదీ చూడండి:ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..!