గ్రీన్‌కార్డుల జారీపై ప్రస్తుతమున్న 7 శాతం దేశీయ పరిమితిని ఎత్తివేస్తూ తీసుకొచ్చిన బిల్లును అమెరికా చట్టసభ సభ్యులు బుధవారం ఆమోదించారు. ఈ చర్య వల్ల అత్యంత నైపుణ్యం కలిగిన వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. సెనేట్‌లోనూ ఆమోదం పొందాల్సి ఉంది.
అత్యంత ప్రతిభావంతులకు ప్రయోజనం
యూఎస్ ప్రతినిధుల సభ ఆమోదించిన ఈ బిల్లు చట్టంగా మారితే.. ఆ దేశంలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిభావంతులైన నిపుణులకు ఊరట చేకూరుతుంది. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వారికి లబ్ధి చేకూరనుంది.
భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువ మంది ప్రధానంగా హెచ్ -1బి వర్కింగ్ వీసాతో అమెరికాకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇమిగ్రేషన్ వ్యవస్థ వల్ల వీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రీన్ కార్డుల కేటాయింపులో 7 శాతం దేశీయ పరిమితి ఉండటం వల్ల అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరుచుకోలేక సతమతమవుతున్నారు.
అమెరికా వెళ్లి.. గ్రీన్‌కార్డు కోసం దశాబ్దం కంటే ఎక్కువ కాలం వేచిచూడాల్సిన పరిస్థితి. ఇటీవల చేపట్టిన కొన్ని అధ్యయనాల ప్రకారం హెచ్ 1బి వీసా కలిగిన భారత ఐటీ నిపుణులు... గ్రీన్‌కార్డు కోసం 70 సంవత్సరాలకు పైగా నిరీక్షించకతప్పదని చెబుతున్నాయి.