అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశనంసనపై దిగువసభ అయిన ప్రతినిధుల సభ సమావేశమైంది. ట్రంప్‌పై అభియోగాలపై సభలో చర్చ ప్రారంభమైంది. సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. స్పీకర్ నాన్సీ పెలోసి, డెమొక్రాట్ సభ్యులు అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ట్రంప్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అదే సమయంలో తనపై అభిశంసన అక్రమమని, విద్వేషపూరితంగా చేపడుతున్నారని డొనాల్డ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు అధ్యక్షుడిని అభిశంసిస్తూ రెండు తీర్మానాలను ప్రవేశపెట్టారని అమెరికా వార్తాసంస్థలు వెల్లడించాయి.
అయితే అభిశంసనపై సుదీర్ఘ చర్చ ప్రారంభానికి ముందే ట్రంప్... స్పీకర్ నాన్సీ పెలోసీకి లేఖ రాశారు. 2020లో అధ్యక్ష ఎన్నికల అనంతరం డెమొక్రాట్లు తమ పనిపై పశ్చాత్తాప పడతారని లేఖలో పేర్కొన్నారు.
"డెమొక్రాట్ చట్టసభ్యులు రాజ్యాంగ విరుద్ధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి అభిశంసన ప్రక్రియ చేపట్టారు. రెండున్నర శతాబ్దాల అమెరిక శాసన చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. మీరు అభిశంసన ప్రాధానాన్ని తగ్గిస్తున్నారు. అభిశంసన చర్యతో ముందుకు వెళితే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లే. రాజ్యాంగంపై మీ విధేయతను ఉల్లంఘిస్తున్నారు. అమెరికా ప్రజాస్వామ్యంపై బహిరంగ యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు."