అమెరికావ్యాప్తంగా 2కోట్ల మంది ప్రజలు కరోనా వైరస్ బారినపడి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో ఇంకా అనేక మందికి వైరస్ ప్రమాదం పొంచి ఉందని అనుమానిస్తున్నారు. కరోనాపై విజయం సాధించినట్టు ప్రకటించి.. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ వార్త ఆందోళన కలిగించే విషయం.
ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కేసులు అగ్రరాజ్యంలోనే వెలుగుచూశాయి. గురువారం నాటికి అమెరికావ్యాప్తంగా 23 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. అంటే తాజా అంచనాలు ఈ కేసుల కన్నా దాదాపు 10రెట్లు ఎక్కువ. కరోనా సోకినట్టు తెలియకుండానే చాలా మంది వైరస్ బారినపడుతున్న విషయం అధికారులకు ముందే తెలుసు. పరీక్ష నిర్వహణలో జాప్యం కారణంగా అనేక కేసులను గుర్తించలేకపోతున్నట్టు భావిస్తున్నారు.
అమెరికా జనాభా 33.1 కోట్లు. అందులో 2 కోట్లు అంటే 6శాతం. అయితే దేశంలో ఇంకా చాలా మందికి ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.