కరోనాపై పోరులో బారత్‌కు అమెరికా సహకారం కొనసాగుతోంది. ఇప్పటివరకు 500మిలియన్ డాలర్ల సాయాన్ని తాము భారత్‌కు అందించామని శ్వేతసౌధం బుధవారం తెలిపింది. త్వరలోనే.. వివిధ దేశాలకు కరోనా టీకాలను పంపిణీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఈ మేరకు విలేకరుల సమావేశంలో శ్వేతసౌధ మీడియా కార్యదర్శి జెన్ సాకి పేర్కొన్నారు.
"ఇప్పటివరకు భారత్‌కు 500 మిలియన్ డాలర్ల కొవిడ్ సాయాన్ని అమెరికా అందించింది. ఇప్పుడు కరోనాతో ప్రభావితమైన ఇతర ఆసియా దేశాలకు మద్దతుగా నిలవాలని బైడెన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మేము ఏడు విమానాల ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు, ఎన్95 మాస్కులు, ఔషధాలు, ర్యాపిడ్ డయోగ్నస్టిక్స్ పరీక్ష కిట్ల వంటి కరోనా సాయాన్ని భారత్‌కు పంపించాం."
-జెన్ సాకి, వైట్‌హౌస్ మీడియా సెక్రెటరీ
త్వరలోనే ప్రపంచ దేశాలకు 8కోట్ల కరోనా టీకాలను సరఫరా చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ఇటీవల ప్రకటించారు. అందులో 6కోట్ల టీకా డోసులు ఆస్ట్రాజెనెకావి కాగా.. మిగతా 2కోట్ల టీకా డోసులు మూడు అనుమతి పొందిన ఇతర సంస్థలకు చెందినవని జెన్‌సాకి వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ల పంపిణీ చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
తీర్మానం ఏకగ్రీవ ఆమోదం..
కొవిడ్‌పై భారత్ పోరులో బైడెన్ ప్రభుత్వ సహకారాన్ని వేగవంతం చేసే తీర్మానాన్ని కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలోని విదేశాంగ వ్యవహారాల కమిటీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీనిని కాంగ్రెస్ సభ్యులు బ్రాడ్ షెర్మన్, స్టీవ్ ఛాబట్ రూపొందించారు. ఈ తీర్మానానికి విదేశీ వ్యవహారాల కమిటీలోని 13 మంది సభ్యులు సహా 24 మంది సభ్యులు మద్దతు తెలిపారు.
కరోనా ప్రారంభ దశలో అమెరికాకు భారత్ చేసిన సాయాన్ని ఈ తీర్మానం గుర్తించింది. వ్యాక్సిన్ ఉత్పత్తి, ఇతర దేశాలకు సాయం చేసిన అంశాన్ని పేర్కొంది. ప్రస్తుతం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్న భారత్‌కు ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు, క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, కంటెయినర్లు, అత్యావసర ఔషధాలు వంటి అదనపు సాయాన్ని అందజేయాలని కోరింది.
6 కోట్ల టీకా డోసులు అందించాలి..
కరోనా రెండో దశ విజృంభణతో సతమతమవుతున్న భారత్‌కు.. బైడెన్ ప్రభుత్వం అండగా ఉండాలని అమెరికాలోని మానవ హక్కుల కార్యకర్త రీవ్ జెస్సీ జాక్సన్ కోరారు. ఇతర దేశాలకు సాయం చేస్తామన్న 8 కోట్ల టీకా డోసుల్లో భారత్‌కు ఆరు కోట్ల టీకా డోసులను అందజేసి ఆదుకోవావాలని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ను కోరారు. ప్రపంచమంతా ఇప్పడు కరోనా కోరల నుంచి భారత్ కోలుకోవాలని ప్రార్థిస్తోందని పేర్కొన్నారు. ఆయనకు కాంగ్రెస్ సభ్యుడు, ఇండో అమెరికన్ రాజా కృష్ణమూర్తి మద్దతు తెలిపారు.
కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన భారత్, అర్జెంటీనా వంటి దేశాలకు అమెరికా సాయాన్ని విస్తృతం చేసేందుకు ఉపకరించే ఓ చట్టాన్ని ప్రతినిధుల సభలో రాజా కృష్ణమూర్తి ప్రవేశపెట్టారు. ద నల్లిఫైయింగ్ ఆపర్చునిటీస్ ఫర్ వేరియంట్స్ టు ఇన్ఫెక్ట్ అండ్ డెసిమేట్(నోవిడ్) యాక్ట్ పేరుతో ఈ చట్టాన్ని రూపొందించారు.
ఇదీ చూడండి:'భారత్ వేరియంట్‌పై అమెరికా టీకాలు భేష్'