తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2021, 6:37 PM IST

ETV Bharat / international

పట్టుబిగిస్తున్న 'క్వాడ్'- చైనా ఉలికిపాటు

ప్రపంచంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా నేతృత్వంలో ఏర్పాటైన క్వాడ్‌ కూటమి ఈ నెల 24న భేటీ కానుంది. కూటమికి చెందిన దేశాధినేతలు తొలిసారిగా సమావేశం కానున్నారు. కరోనా కట్టడి సహా ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు పగ్గాలు, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, అఫ్గానిస్థాన్​లో పరిస్థితులు వంటి అంశాలను చర్చించనున్నారు. ఈ భేటీ కోసం అమెరికా వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. మరోవైపు 'క్వాడ్'పై చైనా నిప్పులు చెరిగింది. ఆ​ కూటమికి భవిష్యత్తు లేదని మండిపడింది.

Report: Significance of the first in-person Quad summit to be held in Washington D.C
క్వాడ్​

వివిధ రూపాల్లో సవాళ్లు విసురుతున్న చైనాను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా నేతృత్వంలో ఏర్పాటైన క్వాడ్‌ కూటమి కీలక భేటీ ఈ నెల 24న జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేతృత్వంలో వాషింగ్టన్‌ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ హాజరుకానున్నారు. క్వాడ్‌ కూటమి 2017లో ఏర్పాటు కాగా.. 2021 మార్చిలో సంబంధిత దేశాధినేతలు వర్చువల్‌గా భేటీ అయ్యారు. వీరు ఈ నెలలో నేరుగా భేటీ అవ్వడం తొలిసారి కానుంది. కొవిడ్‌ నుంచి కోలుకునేందుకు "ఆశ ద్వారా పునరుజ్జీవం" అనే నినాదంతో సాగనున్న ఈ సదస్సులో క్వాడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమంపై కీలక సమీక్ష నిర్వహిస్తారు. సముద్ర జలాలు, సైబర్‌ భద్రత, విపత్తుల సమయంలో మానవతా సహకారం, వాతావరణ మార్పులు, విద్య, అనుసంధాన, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై క్వాడ్‌ దేశాధినేతలు చర్చించనున్నారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, దాని వల్ల ఎదురయ్యే సవాళ్లను కూడా చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను నిలువరించి స్వేచ్ఛాయుతంగా మార్చే అంశంపై చర్చిస్తారు.

ఈ ప్రాంతంలో కీలక సముద్ర మార్గాలపై సరికొత్త వ్యూహాల అభివృద్ధి అంశాన్ని క్వాడ్‌ దేశాధినేతలు చర్చించనున్నారు. ఉత్తర కొరియాకు చైనా సహకారం, ఆ దేశం నిర్వహించిన క్షిపణి పరీక్షల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో తీసుకున్న నిర్ణయాల పురోగతిని క్వాడ్‌ దేశాధినేతలు సమీక్షించనున్నారు.

అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌తో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. బైడెన్‌తో మోదీ సెప్టెంబర్‌ 23న సమావేశం కానున్నట్లు సమాచారం. బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలుమార్లు వర్చవల్‌గా సమావేశమైనా, ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలిసారి. మోదీ సెప్టెంబర్‌ 25న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 76వ భేటీలోనూ ప్రసంగించనున్నారు.

చైనా ఆగ్రహం..

క్వాడ్​ కూటమిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఏర్పడే కూటములను ఎవరూ పట్టించుకోరని, వాటికి భవిష్యత్తు ఉండదని మండిపడింది. ప్రాంతీయ సహకారం కోసం సమయానికి అనుగుణంగా నడుచుకోవాలని, దేశాల మధ్య పరస్పర సహకారం, నమ్మకం ఉండాలని అభిప్రాయపడింది. అంతే కానీ కూటమిగా ఏర్పడి ఇతర దేశాల ప్రయోజనాలకు దెబ్బ కొట్టకూడదని హితవు పలికింది.

ఇదీ చూడండి:-కశ్మీర్​పై తీరు మారని దాయాది.. అప్రమత్తతే కీలకం!

ABOUT THE AUTHOR

...view details