తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కరోనా వైరస్ గేర్​ మార్చిందా? - corona cases in america

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలపైనా కరోనా తన ఉగ్రరూపం చూపించింది. అమెరికాపై అయితే ఆ ప్రభావం మరింత ఎక్కువ. ఈ దేశంలో కొవిడ్‌ దెబ్బకు అసువులు బాసిన వారి సంఖ్య 52 వేలు దాటగా.. బాధితుల సంఖ్య 9.2 లక్షలను మించిపోయింది. ప్రస్తుతం అగ్రరాజ్యం వైరస్ బారి నుంచి క్రమంగా బయటపడుతోందని జాన్స్ హాప్​కిన్స్​ విశ్వవిద్యాలయం నివేదించింది.

US Food and Drug Administration has approved the first at-home COVID-19 test kit, which is expected to bring coronavirus testing to the doorsteps of every household
అమెరికాలోని కరోనా పరిస్థితిపై ఆ నివేదికలు ఏమంటున్నాయి?

By

Published : Apr 25, 2020, 11:08 AM IST

అగ్రరాజ్యం అమెరికాను కొన్ని రోజులుగా గడగడలాడిస్తోంది కరోనా వైరస్​. ఈ మహమ్మారి దెబ్బకు వేల మంది మరణించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో అమెరికా వాటానే 25 శాతం ఉంది. అయితే వైరస్​ వ్యాప్తి గరిష్ఠ దశకు చేరకుందని.. ఇప్పట్నుంచి దాని ప్రభావం తగ్గుతుందని ట్రంప్​ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు జాన్స్​ హాప్​కిన్స్​ విశ్వవిద్యాలయం నివేదికలు బలాన్ని చేకూరుస్తున్నాయి.

గతేడాది నవంబర్​లో చైనా వుహాన్​లో మొదలైన వైరస్​.. ప్రపంచవ్యాప్తంగా 1,95,000 మందిని పొట్టనపెట్టుకుంది. 27 లక్షల మందిని బాధితులుగా మార్చేసింది. ఒక్క అమెరికాలోనే 9.2 లక్షల మందిలో వైరస్​ పాజిటివ్​ లక్షణాలు బయటపడ్డాయి. మరణాలైతే 52 వేలు దాటేసినట్లు ఆ యూనివర్సిటీ లెక్కల్లో తేలింది.

ఆ ఆరింటినీ మించి...

ఒకానొక దశలో వైరస్​ ప్రభావం ఎక్కువగా కనిపించిన స్పెయిన్​ (2,19,764), ఇటలీ (1,92,994), ఫ్రాన్స్​ (1,59,495), జర్మనీ (1,54,545), యూకే (1,44,635), టర్కీ(1,04,912) దేశాలను మించి అమెరికాలో వైరస్​ విజృంభించింది. అయితే కేసులు ఎక్కువగా వచ్చినా.. మరణాల రేటు మాత్రం అగ్రరాజ్యంలో తక్కువగానే ఉన్నట్లు జాన్స్ హాప్​కిన్స్​ నివేదికలు స్పష్టం చేశాయి.

అమెరికాలో మొత్తం 51,000 చనిపోగా.. ఇటలీ (25,969), స్పెయిన్​ (22,524), ఫ్రాన్స్​ (22,245), యూకే(19,506)లో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అగ్రరాజ్యంలోని న్యూయర్క్​పై వైరస్​ బాగా ప్రభావం చూపింది. ఈ ప్రాంతంలోనే దాదాపు 17,671 మంది చనిపోగా.. 2,71,890 మంది వైరస్​ బారిన పడ్డారు.

క్రమేణా తగ్గుతోంది...!

దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య పెంచామని.. ప్రస్తుతం పాజిటివ్​ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. గత వారంలో 38 శాతం పాజిటివ్​ కేసులు రాగా.. ప్రస్తుతం అది 28 శాతానికే పరిమితమైందని తెలిపారు. న్యూయర్క్​లో దాదాపు వారంలోనే 50 శాతం కేసులు, మరణాల రేటు 40 శాతం తగ్గిందని చెప్పారు. దాదాపు 18 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత తగ్గిందని స్పష్టం చేశారు ట్రంప్​.

పునః ప్రారంభమే..

ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది అమెరికా. సామాజిక దూరం పాటించడం, మాస్కుల వాడకాన్ని కచ్చితంగా అమలు చేయనున్నట్లు తెలిపారు ట్రంప్​. అమెరికాలోని వర్కర్ల ఆరోగ్ర భద్రత కోసం ఇప్పటికే 320 బిలియన్​ డాలర్లను కేటాయించారు. 30 బిలియన్​ డాలర్లతో చిన్నస్థాయి సంస్థలకు ఆర్థికంగా చేయూత అందించనున్నారు. మైనారిటీ, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కమ్యూనిటీలకు ఆసరాగా నిలిచేందుకు అమెరికా ప్రభుత్వం ముందుకొచ్చింది. నలుగురు ఉన్న కుటుంబానికి 3400 డాలర్ల చొప్పున ఆర్థిక సాయం అందజేయగా.. దీని ద్వారా 80 మిలియన్ల మంది ప్రజలు లబ్ధి పొందినట్లు అధికారులు తెలిపారు.

టీకా అభివృద్ధికి చేరువలో..

కొవిడ్‌-19 టీకా అభివృద్ధికి అమెరికా అత్యంత సమీపంగా వచ్చేసిందని తెలిపింది అమెరికా ప్రభుత్వం. ఇప్పటికే 72 వ్యాక్సిన్లు ట్రయల్స్​లో ఉండగా.. 211 ప్లానింగ్​ దశలో ఉన్నట్లు స్పష్టం చేసింది. బాధితులపై ప్లాస్మా, యాంటీవైరల్​ థెరపీలను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్​ తయారీ కోసం ఎఫ్​డీఏ(అమెకిరా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్టేషన్​) రెండు పరిశోధనా సంస్థలకు అనుమతులు సైతం ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇంట్లోనే టెస్టు చేసుకోవచ్చు...

ఇంటివద్దే కొవిడ్​-19 పరీక్ష చేసుకునే సదుపాయమున్న టెస్టు కిట్టుకు అనుమతి ఇచ్చింది ఎఫ్​డీఏ. దాన్ని ల్యాబ్​కార్ప్​ అనే సంస్థ తయారు చేసింది. ఇందుకు 119 డాలర్ల ఖర్చు అయినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కిట్ల సాయంతో ఇంటింటికి వైరస్​ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి.

"ఈ టెస్టు వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాలి. టెస్టు కిట్టు ఉపయోగించి బాధితుడు స్వయంగా స్వాబ్​ పరీక్ష చేసుకోవాలి. వాటి ఫలితాలను ప్రత్యేక బృందాలు తీసుకెళతాయి. వాటిని విశ్లేషించి వైద్యుడు నివేదిక ఇస్తారు" అని ఎఫ్​డీఏ కమిషనర్​ స్టీఫెన్​ తెలిపారు. ఈ కిట్ల ద్వారా హెల్త్​కేర్​ వర్కర్ల పని సులభమవుతుందని, వైద్య బృందాలకు వైరస్​ సోకే అవకాశం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details