కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు 'ఫైజర్' వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇప్పటికే బ్రిటన్, బహ్రెయిన్ వంటి దేశాలు అనుమతించగా.. ఆ జాబితాలో అమెరికా చేరింది. ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది అగ్రరాజ్య ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ). అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలపాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసిన మరుసటి రోజే ఆమోదం లభించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో త్వరలోనే ఆరోగ్య సిబ్బంది, తీవ్రంగా ప్రభావితమైన వారికి టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఈ టీకాను అమెరికన్ దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. తమ టీకా 90 శాతానికిపైగా సమర్థవంతంగా పనిచేస్తోందని ఇప్పటికే ప్రకటించింది ఫైజర్ సంస్థ.
మరో 100 మిలియన్ల మోడెర్నా డోసులు
తమ నుంచి అదనంగా మరో 100 మిలియన్ డోసులను అమెరికా కొనుగోలు చేయనుందని ప్రకటించింది మోడెర్నా సంస్థ. ఫలితంగా మొత్తం 200 మిలియన్ డోస్‌ల లక్ష్యం పూర్తవుతుందని తెలిపింది. తొలి 100 మిలియన్ డోసుల్లో 20 మిలియన్లు ఈనెల చివరినాటికి అందిస్తామని, మిగతావి 2021 తొలినాళ్లలో అందజేస్తామని స్పష్టం చేసింది. అలాగే తాజాగా అందిన 100 మిలియన్ డోస్‌ల ఆర్డర్‌ను 2021 రెండో అర్ధభాగంలో డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. 2021 జూన్ నాటికి అదనపు డోసులు అందుతాయని అమెరికా ఆరోగ్య, మానవ వనరుల శాఖ మంత్రి అలెక్స్ అజర్ పేర్కొన్నారు.
ఫైజర్‌కు మెక్సికోలోనూ ఓకే..
ఫైజర్-బయఎన్టెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి మెక్సికో ఔషధ భద్రతా కమిషన్ ఆమోదం తెలిపింది. ఫైజర్ టీకా వినియోగానికి అనుమతించిన ఐదో దేశంగా నిలిచింది మెక్సికో. ఇప్పటికే.. బ్రిటన్, కెనడా, బహ్రెయిన్, అమెరికా దేశాలు అనుమతించగా.. తాజాగా మెక్సికో కూడా ఆ జాబితాలో చేరింది. ఈ క్రమంలో 250,000 డోసుల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. వచ్చే వారంలో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని, తొలుత ఆరోగ్య సిబ్బందికి అందిస్తామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి:అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ