US flights cancel over 5G: 5జీ కారణంగా అమెరికాలో పెద్ద సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి. విమానయాన సంస్థలు పలు ఎయిర్లైన్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని వాయిదా వేశాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. ఇందులో భారతీయులు సైతం అధికంగా ఉన్నారు.
US 5G signals Flights cancel
అమెరికా టెలికాం సంస్థలు కొత్తగా అందుబాటులోకి తెస్తున్న 5జీ సేవల వల్ల విమాన సేవలకు ఇబ్బందులు కలుగుతాయని పలు ఎయిర్లైన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 5జీ సిగ్నళ్లు ఎరోప్లేన్ నేవిగేషన్ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని అంటున్నాయి. విమానాల్లోని ఇంజిన్, బ్రేకింగ్ వ్యవస్థలను ట్రాన్సిషన్ మోడ్ నుంచి ల్యాండింగ్ మోడ్‌లోకి మార్చకుండా 5జీ సిగ్నళ్లు నిరోధిస్తాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) పేర్కొంది. దీని వల్ల విమానాలు రన్‌వేపై ల్యాండ్ అయ్యేందుకు వీలు ఉండదని తెలిపింది.
Air India cancels US Flights
ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. విమాన రకాన్ని బట్టి.. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే సర్వీసులను నిలిపివేయడమో, మార్పులు చేయడమో జరిగిందని ట్వీట్ చేసింది. దిల్లీ నుంచి న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో, నేవార్క్(న్యూజెర్సీ) నగరాలకు వెళ్లే విమానాల కార్యకలాపాలు నిలిచిపోయాయని తెలిపింది. వాషింగ్టన్కు మాత్రం యథావిధిగా సర్వీసులు నడుస్తున్నాయని వెల్లడించింది.
ఎయిర్ఇండియాతో పాటు అనేక దేశాల ఎయిర్లైన్లు తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. కార్యకలాపాలపై ఆందోళన నెలకొన్నందున విమానాలను సస్పెండ్ చేస్తున్నట్లు ఎమిరెట్స్ తెలిపింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు విమానాల రద్దు కొనసాగుతుందని పేర్కొంది.
ప్రయాణికుల ఇక్కట్లు..
విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 'నాలుగేళ్ల తర్వాత నేను ఇండియాకు వెళ్తున్నాను. కరోనా వల్ల రెండేళ్లు ఇంటికి వెళ్లలేకపోయా. ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్కు ట్రైన్ ద్వారా వెళ్తా. అక్కడి నుంచి టికెట్ దొరికితే ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తా' అని న్యూయార్క్‌లో ఉండే భారతీయుడు జయంత్ రాజా పేర్కొన్నారు.
5జీ సేవల వాయిదా..
మరోవైపు, ఎయిర్లైన్ల ఆందోళనలు, బైడెన్ యంత్రాంగం చేపట్టిన చర్యల నేపథ్యంలో.. 5జీ సేవల ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు టెలికాం సంస్థలు ఏటీ అండ్ టీ, వెరిజాన్ ప్రకటించాయి. నిర్దిష్ట ఎయిర్‌పోర్టుల వద్ద సర్వీసులను ప్రారంభించడం లేదని తెలిపాయి. ఈ సమస్యపై ఎయిర్‌లైన్ సంస్థలు బైడెన్ యంత్రాంగానికి లేఖ రాసిన నేపథ్యంలో తాజా ప్రకటన చేశాయి. దీనిపై అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఇరుపక్షాలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
కొన్ని ఎయిర్‌పోర్టుల రన్‌వేలకు సమీపంలో 5జీ సెల్ టవర్లను ఏర్పాటు చేయబోమని ఏటీ అండ్ టీ తెలిపింది. సమస్య పరిష్కారానికి ఫెడరల్ రెగ్యులేటరీలతో పనిచేస్తామని వెల్లడించింది. మరోవైపు, విమానాశ్రయాల చుట్టూ 5జీ సేవలను పరిమితంగానే అందుబాటులోకి తెస్తామని వెరిజాన్ పేర్కొంది. అయితే, తాము ఉపయోగించిన పరికరాలు, సాంకేతికత.. విమాన వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపబోదని రెండు టెలికాం సంస్థలు పేర్కొన్నాయి. అనేక దేశాల్లో ఈ సాంకేతికతను సురక్షితంగా వినియోగిస్తున్నట్లు స్పష్టం చేశాయి.
త్వరలో శాశ్వత పరిష్కారం: బైడెన్
టెలికాం సంస్థల మధ్య కుదిరిన అవగాహన వల్ల విమాన ప్రయాణాలకు కలిగే ముప్పును నివారించినట్లు అవుతుందని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. 90 శాతం టవర్లను ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేవరకు ఇరుపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:5జీ సేవల ఎఫెక్ట్.. వందల విమానాలు రద్దు- ఇక సంక్షోభమే!