భారత్ బుధవారం ప్రయోగించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి అంతరిక్షంలో వందల సంఖ్యలో శకలాలను మిగిల్చిందని అమెరికా రోదసీ నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యర్థాలను నివారించేందుకు ప్రపంచదేశాలు ఎన్నో ఏళ్లుగా కృషిచేస్తుంటే... ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
అంతరిక్షంలో వ్యర్థాలు సృష్టించరాదని అంతర్జాతీయంగా ఎలాంటి నిబంధన లేదని అమెరికా నెబ్రాస్కా-లింకన్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఫ్రాన్స్ ఓన్ డెర్ డంక్ చెప్పారు. అయితే... ఇతర దేశాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏశాట్ పరీక్ష నిర్వహించడం 1967 రోదసీ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనంటూ భారత్‌ను తప్పుబట్టారు.