సినిమాలో క్లైమాక్స్ బాగుంటే.. ఆ చిత్రం సూపర్‌హిట్ అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ సూత్రం సినిమాలకే కాదు రాజకీయాలకూ వర్తిస్తుంది. నేతలు ఐదేళ్లు సుపరిపాలన అందించినప్పటికీ ఎన్నికల సమయంలో చేసే ప్రచారాలే ఓటర్లను ఆకర్షించి తుది ఫలితాలను నిర్దేశిస్తాయి. అయితే ప్రస్తుతం కరోనా దెబ్బతో ప్రపంచ రాజకీయాల స్థితిగతులు మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగాల్సి ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన ప్రత్యర్థి పార్టీ నేతలైన డెమొక్రాట్లకు కూడా ఓటర్లను ఆకర్షించేందుకు ఇదే అత్యంత కీలక సమయం. అయితే కరోనా దెబ్బతో అటు రిపబ్లికన్, ఇటు డెమొక్రటిక్ పార్టీ నేతలు ప్రచారాలను వాయిదా వేయక తప్పలేదు.
ఇటు ట్రంపే.. మరి అటు?
ప్రధాన పార్టీల అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ జరిగే కాకసస్(పార్టీ ప్రాథమిక ఎన్నికల)పైనా కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాగా.. మరికొన్ని రాష్ట్రాల్లో వాయిదా పడింది. ఫలితంగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి దిగేదెవరో తేలేందుకు మరింత సమయం పట్టనుంది. ఇప్పటివరకు జరిగిన కాకసస్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బిడెన్, బెర్నీ శాండర్స్ ముందంజలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ మరోమారు అధ్యక్ష బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రచారాలే కీలకం.. కానీ..!
ఎన్నికల సమయంలో నేతలు ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి సరైన మార్గాలు ప్రచారాలే. ట్రంప్‌కు అత్యంత శక్తిమంతమైన రాజకీయ ఆయుధాలు కూడా ఎన్నికల ర్యాలీలే. గత అధ్యక్ష ఎన్నికల్లోనూ 'అమెరికానే ప్రథమం' అని నినదిస్తూ.. హిల్లరీ క్లింటన్‌పై అనూహ్య విజయం సాధించారు ట్రంప్. అందుకే ప్రచారాల్లో తనదైన శైలిలో డెమొక్రాట్లపై విరుచుకుపడి ఓటర్లను ఆకర్షించడంలో ట్రంప్ దిట్ట.