పర్యావరణ మార్పుల అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ తీర ప్రాంతాల్లో కార్చిచ్చు సహా ఇటీవలి వాతావరణ పరిస్థితులు.. పర్యావరణ మార్పులకు అత్యవసర పరిష్కారం కనుగొనాలని నొక్కిచెబుతున్నాయని అన్నారు.
ఈ మేరకు డెలావేర్లో పర్యావరణ సంబంధిత అంశాలపై మాట్లాడారు బైడెన్. ట్రంప్‌కు మరోసారి అధికారం కట్టబెడితే.. అమెరికాలో మరిన్ని కార్చిచ్చులు ఏర్పడతాయని అన్నారు. గత పదేళ్లలో ఉష్ణోగ్రతలు అత్యంత గరిష్ఠ స్థాయిలో నమోదయ్యాయని గుర్తు చేశారు. వాతావరణ మార్పులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అమెరికాలోని అన్ని నగరాలు, పట్టణాలలో వినాశనం ఏర్పడుతుందని హెచ్చరించారు.